ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : 24.18 కోట్ల విలువైన ప్రభుత్వ ధాన్యం దుర్వినియోగం చేసినందుకు ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు పెద్దపల్లి డిఎస్పి రాంరెడ్డి తెలిపారు. సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఏసీపీ జి. కృష్ణ తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ కేసు వివరాలను వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ పెద్దపల్లి జిల్లా ఆధ్వర్యంలో కే ఎం ఎస్ 2023-24లో సుల్తానాబాద్ మండలం సుగ్లాంపల్లి గ్రామంలోని ఎంఎస్. లక్ష్మి ఇండస్ట్రీస్కు కస్టమ్ మిల్లింగ్ కోసం 10,015.636 మెట్రిక్ టన్నుల ప్రభుత్వ ధాన్యాన్ని అప్పగించారు. అప్పగించిన ధాన్యానికి అనుగుణంగా 6,662.880 మెట్రిక్ టన్నుల సిఎంఆర్ బియ్యాన్ని ప్రభుత్వానికి అందించాల్సి ఉండగా,మిల్లర్ ఇప్పటివరకు 1,577.289 మెట్రిక్ టన్నుల సిఎంఆర్ బియ్యాన్ని మాత్రమే అందించారు. అదనంగా 64.872 మెట్రిక్ టన్నుల సిఎంఆర్ కు సమానమైన నగదు స్వీకరించబడింది. దీంతో 5,020.719 మెట్రిక్ టన్నుల CMR బియ్యం బకాయి ఉండగా,దానికి సమానమైన 7,493.610 మెట్రిక్ టన్నుల ధాన్యం డిఫాల్ట్ అయినట్లు అధికారులు గుర్తించారు.దీని ద్వారా ప్రభుత్వానికి జరిగినట్లు గుర్తించిన ఆర్థిక నష్టంరూ.24,18,59,070/-గా ఉంది. 06-08-2026న సివిల్ సప్లైస్ అధికారులు ఎంఎస్.లక్ష్మి ఇండస్ట్రీస్ రైస్ మిల్లును భౌతికంగా తనిఖీ చేశారు.తనిఖీ సమయంలో కస్టమ్ మిల్లింగ్ కోసం మిల్లర్‌కు అప్పగించిన ప్రభుత్వ ధాన్యానికి సంబంధించిన స్టాక్ మిల్లు ప్రాంగణంలో భౌతికంగా అందుబాటులో లేదని గుర్తించారు. అప్పగించిన ప్రభుత్వ ధాన్యం నిల్వలను సక్రమంగా లెక్కల్లో చూపకపోవడంతో, ప్రభుత్వ ధాన్యాన్ని దారి మళ్లించి దుర్వినియోగం చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. టీజీఎస్సీ ఎస్సీఎల్ పెద్దపల్లి జిల్లా మేనేజర్ ముప్పిడి శ్రీకాంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సుల్తానాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో నిందితులను గుర్తించి అరెస్ట్ చేసినట్లు డీసీపీ తెలిపారు.ప్రభుత్వానికి సంబంధించిన ధాన్యం,బియ్యం విషయంలో అక్రమాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
Admin
E Nivas News