ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు సృష్టించే అభివృద్ధి కార్యక్రమాలను నాణ్యతతో, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసన వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. సోమవారం మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి మంథని పట్టణంలో విస్తృతంగా పర్యటించారు. పర్యటనలో భాగంగా శివకిరణ్ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన మన ఊరు–మన కోచింగ్ సెంటర్ ఉచిత కానిస్టేబుల్, ఎస్సై కోచింగ్ సెంటర్‌ను ప్రారంభించారు. అనంతరం ఎస్‌ఎల్‌బీ గార్డెన్‌లో టీ వర్క్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన పాఠశాల విద్యార్థుల క్రీడా పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం చేసి ఉచిత హెల్మెట్లను పంపిణీ చేశారు. మంథని క్యాంపు కార్యాలయంలో హిందుస్థాన్ కోకాకోలా బెవరేజెస్, ఇతర పరిశ్రమల ప్రతినిధులు, జిల్లా కలెక్టర్, అధికారులతో కలిసి పరిశ్రమల అభివృద్ధి అంశాలపై సమీక్ష నిర్వహించారు. హిందుస్థాన్ కోకాకోలా బెవరేజెస్ సంస్థ సీఎస్‌ఆర్ కార్యక్రమం ప్రాజెక్ట్ షైన్ కింద చేపడుతున్న బొక్కలవాగు చెక్‌డ్యామ్ అప్‌గ్రేడేషన్, సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ సివిల్ ఆసుపత్రిలో నూతన డెవలప్‌మెంట్ కమిటీ సమావేశంలో పాల్గొని వైద్య సేవల అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. రత్నాపూర్ గ్రామంలో ప్రతిపాదిత కోకాకోలా పరిశ్రమ ఏర్పాటుకు ఎంపిక చేసిన స్థలాన్ని పరిశీలించారు. *ఉద్యోగం సాధించే వరకు అండగా ఉంటాం 'మన ఊరు–మన కోచింగ్ సెంటర్' ప్రారంభోత్సవంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటికే 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిందని, ప్రస్తుతం మరో 7 వేలకుపైగా పోలీస్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. ఈ అవకాశాన్ని యువత పూర్తిగా వినియోగించుకోవాలని, రాబోయే మూడు నెలలు జీవితాన్ని మార్చే కాలంగా భావించి స్పష్టమైన లక్ష్యంతో సిద్ధం కావాలని సూచించారు. కోచింగ్ సెంటర్‌లో అత్యుత్తమ శిక్షణతో పాటు అవసరమైన పుస్తకాలు, స్టడీ మెటీరియల్, వసతి, భోజన సౌకర్యాలను పూర్తిగా ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. ప్రతిరోజూ కనీసం 15 గంటలు క్రమశిక్షణతో చదివి ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు. విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించడం వరకు తన బాధ్యత అని, ఉద్యోగం సాధించడం మాత్రం వారి సంకల్పం, కష్టపడే తత్వంపైనే ఆధారపడి ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. తాను దారి చూపగలనని, కానీ విజయాన్ని అందుకునేది వారి కృషి ద్వారానేనన్నారు. వచ్చే మూడు నెలలు ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, మంచి ఆలోచనలతో, క్రమశిక్షణతో చదివి ఉద్యోగం సాధిస్తే వారి కుటుంబాల్లో ఆనందం నింపినట్లవుతుందని, అదే తనకు నిజమైన సంతృప్తినిస్తుందన్నారు. *పరిశ్రమలకు ప్రభుత్వం పూర్తి సహకారం* మంథని క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, హిందుస్థాన్ కోకాకోలా బెవరేజెస్ ప్రతినిధులు, ఇతర పరిశ్రమల ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో మంత్రి మాట్లాడుతూ పరిశ్రమల స్థాపనకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు. పరిశ్రమలకు అవసరమైన విద్యుత్, నీరు, రహదారులు, ఇతర మౌలిక వసతులు అన్నింటినీ ప్రభుత్వం కల్పిస్తుందని తెలిపారు. రాష్ట్రానికి మరిన్ని నాణ్యమైన పెట్టుబడులు రావడం, స్థానిక యువతకు అధిక ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
*బొక్కలవాగు అభివృద్ధితో నీటి సంరక్షణ – ప్రజలకు మెరుగైన వాతావరణం* హిందుస్థాన్ కోకాకోలా బెవరేజెస్ సంస్థ తమ సీఎస్‌ఆర్ కార్యక్రమం ప్రాజెక్ట్ షైన్ కింద చేపడుతున్న బొక్కలవాగు చెక్‌డ్యామ్ అప్‌గ్రేడేషన్, సుందరీకరణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. బొక్కలవాగు వద్ద గార్డెనింగ్, ఓపెన్ జిమ్ అప్‌గ్రేడేషన్, వాకింగ్ ట్రాక్, చిన్నారుల కోసం పార్కు వంటి సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఎన్నో సంవత్సరాలుగా బొక్కలవాగులో పేరుకుపోయిన పూడికను తొలగించేందుకు డీ-సిల్టింగ్ పనులు కూడా చేపడుతున్నామన్నారు. బొక్కలవాగు బండ్ అభివృద్ధి పనులకు గతంలో 2011-12లో అనుమతులు లభించాయని, ప్రస్తుతం వాటిని ఆధునికీకరిస్తున్నామని తెలిపారు. ఈ అభివృద్ధి పనులను సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) కార్యక్రమంలో భాగంగా చేపట్టాలని హిందుస్థాన్ కోకాకోలా బెవరేజెస్ సంస్థను కోరగా, సంస్థ ప్రతినిధులు సానుకూలంగా స్పందించి రూ.2 కోట్ల నిధులు అందించారని మంత్రి పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా నీటి సంరక్షణ మెరుగుపడటంతో పాటు పరిసర ప్రాంత ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం, మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ప్రభుత్వం, పరిశ్రమలు కలిసి పనిచేస్తే సమాజానికి మరింత మేలు చేయగలమని పేర్కొంటూ ఈ కార్యక్రమాన్ని చేపట్టిన హిందుస్థాన్ కోకాకోలా బెవరేజెస్ సంస్థను అభినందించారు. తెలంగాణ వ్యాప్తంగా మరిన్ని పరిశ్రమలు కూడా ఇలాంటి సామాజిక బాధ్యత కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. బొక్కలవాగు సుందరీకరణ, గార్డెనింగ్, డీ-సిల్టింగ్, వాకింగ్ ట్రాక్, జిమ్, చిన్నారుల పార్కు తదితర అభివృద్ధి పనులను అత్యున్నత నాణ్యతతో, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పనుల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండరాదని స్పష్టం చేశారు. అనంతరం మంథని ప్రభుత్వ సివిల్ ఆసుపత్రిలో నిర్వహించిన నూతన డెవలప్‌మెంట్ కమిటీ సమావేశంలో పాల్గొని ప్రభుత్వ వైద్య సేవల అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన మౌలిక వసతులు, వైద్య పరికరాలు, ఇతర సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.
*మంథని అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది* మంథని పట్టణంలో రోడ్ల విస్తరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని, పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు పలు మౌలిక వసతుల పనులను ప్రభుత్వం ప్రాధాన్యతతో చేపడుతోందన్నారు. ఈ కార్యక్రమాల్లో ఆర్డీవో సురేష్ , మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్, సయేందర్ రెడ్డి,తహసిల్దార్ ఆరిఫ్ ఉద్దీన్ ,ప్రజాప్రతినిధులు, హిందుస్థాన్ కోకాకోలా బెవరేజెస్ ప్రతినిధులు, ఇతర పరిశ్రమల ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు, యువత, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
Admin
E Nivas News