ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలని, ఆయన వందేళ్లకు పైగా బతికుండాలనే తాము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని రాష్ట్ర ఐటీ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు బుధవారంస్పష్టం చేశారు.కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ ఎవరి చావునూ కోరుకునే సంస్కృతి కాదని ఆయన తేల్చి చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ అనుభవంతో కూడిన మార్గదర్శకత్వంలో ప్రజాసేవ కొనసాగాలని తాము ఆకాంక్షిస్తున్నామని పేర్కొన్నారు. చట్టసభల్లో ప్రజాసమస్యలపై చర్చించేందుకు నిబంధనలు ఉంటాయని, బీఆర్‌ఎస్ సభ్యులు లేవనెత్తాలనుకుంటున్న అంశాలను సభా నిబంధనావళి ప్రకారం సరైన రూపంలో స్పీకర్‌కు లిఖితపూర్వకంగా సమర్పించాలని ఆయన హితవు పలికారు. చట్టసభల హుందాతనాన్ని కాపాడటంలో ఎలాంటి రాజీ ఉండదని, శాసనసభ ప్రాంగణంలో, సభ లోపల అసభ్యకరమైన పదజాలం వాడటం, అభ్యంతరకరంగా ప్రవర్తించడాన్ని ఏమాత్రం ఆమోదించే ప్రసక్తే లేదని మంత్రి శ్రీధర్‌బాబుహెచ్చరించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో నియమ నిబంధనలకు అందరూ కట్టుబడి ఉండాలని, స్పీకర్ స్థానాన్ని గౌరవిస్తూ సభా కార్యకలాపాలు సజావుగా సాగేందుకు సహకరించాలని కోరారు. ప్రతిపక్షం నిర్మాణాత్మకమైన సలహాలు, సూచనలతో ప్రజల పక్షాన నిలబడాలే తప్ప, వివాదాలు సృష్టిస్తూ ప్రజా సమస్యలను పక్కదారి పట్టించడం సరికాదని ఆయన స్పష్టం చేశారు.
Admin
E Nivas News