ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : మంథని మండలం ఖాన్‌సాయిపేట గ్రామపంచాయతీ పరిధిలో ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులతో నిర్మించిన సీసీ రోడ్ల నిర్మాణం పూర్తయి నెల రోజులు గడవకముందే పగుళ్లు బారడంతో పనుల నాణ్యతపై గ్రామస్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గ్రామపంచాయతీ పాలకవర్గం తీర్మానం ప్రకారం ఎస్సీ కాలనీ నుంచి పోచమ్మ గుడి, స్మశాన వాటిక వరకు సీసీ రోడ్డు నిర్మించాల్సి ఉండగా, అందుకు భిన్నంగా అవసరం లేని ప్రాంతంలో రోడ్డు నిర్మాణం చేపట్టారని బిఆర్ఎస్ ఖాన్‌సాయిపేట గ్రామశాఖ అధ్యక్షుడు కుడుదుల వెంకటేష్ ఆరోపించారు. గ్రామపంచాయతీ కార్యాలయం, పాఠశాల ముందు ఇప్పటికే ఉన్న సీసీ రోడ్డుపైనే మళ్లీ సీసీ రోడ్డు వేసినట్లు ఆయన పేర్కొన్నారు. నిర్మాణ సమయంలో సంబంధిత ఇంజనీర్ క్షేత్రస్థాయిలో పనులను పర్యవేక్షించలేదని, గ్రామపంచాయతీ తీర్మానం లేకుండానే పనులు చేపట్టినట్లు ఆరోపణలు ఉన్నాయని వెంకటేష్ తెలిపారు. పనుల నాణ్యత, అంచనాలు, ఉపయోగించిన మెటీరియల్, నిర్మాణ విధానంపై అధికారులు సమగ్రంగా విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. నెల రోజులకే పగుళ్లు బారిన సీసీ రోడ్లను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా పనులు చేపట్టినట్లు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోని ప్రభుత్వ నిధులు దుర్వినియోగం కాకుండా చూడాలని కుడుదుల వెంకటేష్ ఒక ప్రకటనలో ఉన్నతాధికారులను కోరారు.
Admin
E Nivas News