ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : రామగుండం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో 8వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా సిపి మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సాయుధ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన గౌరవ వందనాన్ని స్వీకరిస్తూ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసు అధికారులు, సిబ్బందికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా సీపీ అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ రామగుండం కమిషనరేట్ పరిధిలోని ప్రజలకు, పోలీసు అధికారులు, సిబ్బందికి 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించేందుకు ఎందరో స్వాతంత్ర్య సమరయోధులు చేసిన త్యాగాలు, చేసిన ప్రాణబలిదానాలు చిరస్మరణీయమని అన్నారు.వారి త్యాగాల ఫలితంగానే మనం స్వేచ్ఛాయుతమైన, ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నామని పేర్కొన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలను సాకారం చేసేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య దినోత్సవం ప్రతి భారతీయుడికి ఎంతో ముఖ్యమైన రోజని, బ్రిటిష్ పాలన నుంచి దేశానికి స్వాతంత్ర్యం లభించిన ఈ రోజు భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది వేసిన చారిత్రక ఘట్టమని తెలిపారు. స్వాతంత్ర్యంఅనంతరం ప్రజాస్వామ్య ప్రభుత్వాల ఆధ్వర్యంలో దేశంతో పాటు తెలంగాణ రాష్ట్రం కూడా అనేక రంగాల్లోగణనీయమైన అభివృద్ధిని సాధించిందన్నారు. అభివృద్ధితో పాటు సమాజంలో సామరస్యం,ప్రజల మధ్య ఐక్యత మరింత బలపడాలని ఆకాంక్షించారు. అభివృద్ధి చెందిన తెలంగాణను నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని సూచించారు.ఈ అభివృద్ధి ప్రయాణంలో పోలీసు శాఖ కూడా ప్రజలతో కలిసి పనిచేస్తోందన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ,నేరాల నియంత్రణ,ట్రాఫిక్ నిర్వహణతో పాటు విపత్తులు,అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు అండగా నిలవడం పోలీసుల ప్రధాన బాధ్యతలని తెలిపారు.విధుల స్వరూపం, పరిస్థితులు మారుతున్నప్పటికీ పోలీసుల లక్ష్యం ఒక్కటేనని, ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే పోలీసు శాఖలో చేరామని పేర్కొన్నారు. అదే సేవాభావం, అంకితభావంతో విధులు నిర్వహిస్తూ ప్రజల భద్రతకు, రాష్ట్ర అభివృద్ధికి పోలీసు అధికారులు,సిబ్బంది తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని సీపీ విజ్ఞప్తి చేశారు.పోలీసులతో సమన్వయంతో పనిచేస్తూ శాంతిభద్రతల పరిరక్షణకు, సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ప్రజలు,పోలీసులు సమన్వయంతో ముందుకు సాగితే మరింత సురక్షితమైన, ప్రశాంతమైన, అభివృద్ధి చెందిన సమాజాన్ని నిర్మించగలమని అన్నారు.ప్రజలకు పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ,వారు ప్రశాంతమైన వాతావరణంలో జీవించేలా అన్ని విధాలా కృషి చేస్తామని సీపీ తెలిపారు.ఈ సందర్భంగా విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులు, సిబ్బందికి సీపీ ప్రశంసాపత్రాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ (అడ్మిన్) కె.శ్రీనివాస్, గోదావరిఖని ఏసీపీ రమేష్,స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ నాగేంద్ర గౌడ్, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, సీసీఎస్ ఏసీపీలు రవీందర్, ప్రవీణ్ కుమార్,టాస్క్‌ఫోర్స్ ఏసీపీ శ్రీనివాస్ రావు, ఏఓ శ్రీనివాస్, సీఐలు, ఎస్‌ఐలు, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు దామోదర్, మల్లేశం,రమేష్, సూపరింటెండెంట్ ఇంద్రసేనారెడ్డి, మనోజ్,సందీప్, సంధ్య,సీసీ సందీప్‌తో పాటు వివిధ విభాగాలకు చెందిన అధికారులు,సిబ్బంది, సీపీఓ,ఏఆర్,స్పెషల్ పార్టీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News