ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి అధికారులు సమన్వయంతో కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సంజయ్ జాజు తెలిపారు . మంగళవారం హైదరాబాద్ నుండి ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, అధికారులతోవాతావరణ పరిస్థితులు, వర్షపాతం, ప్రత్యామ్నాయ పంటల సాగు, నీట్ పరీక్ష నిర్వహణ, పర్యాటక రంగ అభివృద్ధి తదితర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసి పర్యాటకులకు సులభమైన ప్రయాణాలు, వసతి, స్మార్ట్ పాస్‌లు ఇతర సౌకర్యాలు కల్పించి 27 గుర్తించిన ప్రత్యేక పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయాలని తెలిపారు. నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు, జీవనోపాధి కల్పించేందుకు స్థానిక ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలని తెలిపారు. తెలంగాణ సంస్కృతి, హస్తకళలు, వారసత్వ సంపదను సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం చేస్తూ బ్రాండ్ తెలంగాణను బలోపేతం చేయాలని తెలిపారు. పర్యావరణహిత పర్యాటకం లక్ష్యంగా ప్రత్యేక పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి ప్రణాళిక సిద్ధం చేయడం జరిగిందని, ఇందులో పర్యాటక ప్రాంతాల వర్గీకరణ చేసి ఆధ్యాత్మిక, వారసత్వ, పరిసరాల,ఇకో, హస్తకళల పర్యాటకంగా గుర్తించి అభివృద్ధికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. నీట్ పి.జి.- 2026 పరీక్ష నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని తెలిపారు. పరీక్షకు సంబంధించి 14 జిల్లాలలో 56 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా మొత్తం 17 వేల 627 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని, పరీక్షను పారదర్శకంగా, సురక్షితంగా నిర్వహించేందుకు బహుళస్థాయి పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రతి 12 మంది అభ్యర్థులకు ఒక ఇన్విజిలేటర్, సుమారు 3 వేల మంది ఎన్.బి.ఈ.ఎం.ఎస్. అప్రైజర్లు, సోషల్ మీడియా మానిటరింగ్, 600 మంది ఫ్లయింగ్ స్క్వాడ్లు, 16 ప్రాంతీయ కమాండ్ సెంటర్ల ద్వారా పర్యవేక్షణ చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ప్రశ్నపత్రాల భద్రతకు ఆర్.ఎస్.ఎ. ఎన్‌క్రిప్షన్ విధానాన్ని వినియోగిస్తున్నామని, పరీక్షకు 60 నిమిషాల ముందు వి.పి.ఎన్. ద్వారా ప్రశ్నపత్రాన్ని అప్‌లోడ్ చేసి, పరీక్షకు 30 నిమిషాల ముందు పాస్‌వర్డ్ విడుదల చేయడంతో పాటు, అభ్యర్థి లాగిన్ అయిన తర్వాత మాత్రమే ప్రశ్నపత్రాన్ని డీక్రిప్ట్ చేసే విధానం అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన పరిశీలన చర్యలు చేపట్టి ఎ.ఐ. గ్లాసెస్, బ్లూటూత్ ఇయర్‌పీస్‌లు, స్పై కెమెరాలు, ఇతర డిజిటల్ పరికరాలను అనుమతించరాదని, అవసరమైన చోట స్థానిక పోలీసుల సహకారంతో ప్రవేశ నియంత్రణ చేపట్టాలని, పరీక్షను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న వానాకాలం,ఖరీఫ్ సీజన్‌లో లోటు వర్షపాతం దృష్ట్యా సాగు విస్తీర్ణం, నీటి లభ్యత, రిజర్వాయర్ల నీటిమట్టాలు తదితర అంశాలను నిరంతరం పర్యవేక్షిస్తూ మండలాల వారీగా వ్యవసాయ పరిస్థితులను అంచనా వేయాలని సూచించారు. రైతులు అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకునేలా సూచనలు ఇస్తూ, ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని తెలిపారు. నీటి లభ్యత, నేల స్వభావం, వాతావరణ పరిస్థితులు, మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా రైతులు ఒకే పంటపై ఆధారపడకుండా పంటల వైవిధ్యీకరణను చేపట్టేలా వ్యవసాయ శాఖ అధికారులు అవగాహనకల్పించాలని సూచించారు. పప్పుధాన్యాలు, నూనెగింజలు, మొక్కజొన్న, జొన్న, వేరుశెనగ, కందులు, పెసలు, మినుములు, సోయాబీన్, కూరగాయలు, ఆయిల్‌పామ్ తదితర ప్రత్యామ్నాయ పంటలను ప్రాంతానుకూలంగా ప్రోత్సహించాలని తెలిపారు. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పర్యాటక రంగ అభివృద్ధి, పంటల వైవిధ్యీకరణపై రైతులకు అవగాహన కల్పిస్తూ ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డి.సి.పి. ఎ. భాస్కర్, జిల్లా అటవీ అధికారి రాహుల్ కిషన్ జాదవ్, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, మంచిర్యాల రాజస్వ మండల అధికారి శ్రీనివాస్ రావు, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ మహమ్మద్ విలాయత్ అలీ, జిల్లా క్రీడా యువజన సేవల అధికారి హనుమంత రెడ్డి, జిల్లా మాధ్యమిక విద్యాధికారి అంజయ్య, సంబంధిత అధికారులుతదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News