ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో / కొండపర్తి ప్రసన్నకుమార్ : మహిళా ఐఏఎస్ అధికారిని కించపరిచేలా ఆరోపణలు చేస్తూ వార్తలు, కథనాలు ప్రసారం చేసిన ఘటనపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది. డీజీపీ శివధర్ రెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలో 8 మంది అధికారులతో సిట్‌ను ఏర్పాటు చేశారు. మహిళా ఐఏఎస్ అధికారిపై నిరాధార ఆరోపణలు చేస్తూ పలు మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానెళ్లు కథనాలు ప్రసారం చేసిన నేపథ్యంలో ఇప్పటికే కేసులు నమోదు అయ్యాయి. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫొటోలను అసభ్యకరంగా మార్పులు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఘటనపై కూడా మరో కేసు నమోదైంది. ఈ రెండు అంశాలపైనా సమగ్ర విచారణ జరిపేందుకు ప్రభుత్వం సిట్‌కు బాధ్యతలు అప్పగించింది. సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్‌ఫాంలను దుర్వినియోగం చేస్తూ వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ప్రభుత్వం స్పష్టం చేసింది. సిట్ దర్యాప్తులో నిజానిజాలు వెలుగులోకి తీసుకువచ్చి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
Admin
E Nivas News