ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : పోలీస్ సిబ్బంది ప్రతి ఒక్కరూ సమయపాలన, క్రమశిక్షణ పాటిస్తూ జిల్లాలో గంజాయి, మాదకద్రవ్యాలను రూపుమాపే దిశగా కృషి చేయాలి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ తెలియజేశారు. కేటాయించిన విధులను సక్రమంగా నిర్వర్తించాలని సూచించారు. స్టేషన్ సిబ్బంది నిర్వహిస్తున్న విధులను ప్రతిరోజు క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని పోలీస్ స్టేషన్ పరిసరాలు పరిశుభ్రతతో ఉంచుకోవాలని సూచించారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల గౌరవంగా వ్యవహరించాలని, సమస్యలను శాశ్వతంగా పరిష్కరించే దిశగా కృషి చేయాలని తెలిపారు. పోలీస్ స్టేషన్ పూర్తిగా పరిశీలించి పోలీస్ స్టేషన్లో ఉన్న వాహనాలను పరిశీలించి వాటి కేసుల వివరాలు తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ రికార్డులను పరిశీలించి ఎప్పటికప్పుడు నవీకరిస్తూ ఎలాంటి పెండెన్సు లేకుండా ఉండాలని తెలిపారు. కేసులో దర్యాప్తు, నేర పరిశోధన పై పురోగతి సాధించాలని, నాణ్యమైన దర్యాప్తు నిర్వహించి బాధితులకు న్యాయం చేకూర్చే విధంగా నివేదికలను పూర్తి చేయాలని సూచించారు. పోలీస్ స్టేషన్ నిర్వహణలో 5S విధానాన్ని అమలు చేయాలని సూచించారు. రానున్నది ఎన్నికల సమయం ప్రతి గ్రామాన వీపీఓ విధానాన్ని కచ్చితంగా అమలు చేసి, సమాచార వ్యవస్థను పటిష్టం చేసుకొని, ఎలాంటి ఆసాంఘిక కార్యకలాపాలు నిర్వహించకుండా ప్రతిష్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు. గ్రామస్తులతో సమావేశాలు నిర్వహించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించి సైబర్ క్రైమ్, డిజిటల్ ఫ్రాడ్, గంజాయి, మాదకద్రవ్యాల వినియోగం వాటి వల్ల కలుగు అనర్ధాల పై పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు. యువత, మారుమూల గ్రామీణ ప్రాంత ప్రజలు చెడు వ్యసనాల బారిన పడకుండా, చదువు పై ఉన్న ఆవశ్యకతను తెలియజేసే ఉన్నత చదువులు అభ్యసించేలా ప్రోత్సహించాలని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు పోలీసులపై నమ్మకం పెంపొందించేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి, బోత్ సిఐ ఏ వెంకటేశ్వరరావు, బజార్హత్నూర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News