ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మహిళల గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తించే వారిపై, ప్రత్యేకించి చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే నిబంధనలు ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదని తెలంగాణ పోలీస్ శాఖ స్పష్టం చేసింది.మాజీ ఎంపీ, టీఆర్ఎస్అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను ఉద్దేశించి సామాజిక మాధ్యమాల్లో అత్యంత అసభ్యకరమైన, అనుచిత పోస్టులు పెట్టిన వ్యవహారంలో ఓ పోలీసు కానిస్టేబుల్‌పై పోలీస్ శాఖ తీవ్రస్థాయిలో చర్యలు చేపట్టింది. ఫిర్యాదు అందిన వెంటనే స్పందించిన ఉన్నతాధికారులు, సివిల్ సర్వీసెస్ కాండక్ట్ రూల్స్ ప్రకారం సదరు కానిస్టేబుల్ కె. అనిల్‌ను తక్షణమే విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.హైదరాబాద్ పోలీస్ కమిషనర్ నుంచి ప్రాథమిక విచారణ నివేదిక అందిన వెంటనే అంతర్గతశాఖాపరమైన విచారణ (డిపార్ట్‌మెంటల్ ఎంక్వైరీ) చేపట్టి, నిబంధనల ప్రకారం కఠిన శిక్ష విధిస్తామని ఉన్నతాధికారులు వెల్లడించారు. శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలతో పాటు కానిస్టేబుల్ అనిల్‌పై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేశారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్స్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 589/2026 కింద భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు 75, 79లతో పాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) చట్టంలోని సెక్షన్ 67 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.ప్రాథమిక విచారణలో నిందితుడు తన వ్యక్తిగత మొబైల్ ఫోన్ నుంచే ఈ అభ్యంతరకర పోస్టులను పెట్టినట్లు నిర్ధారణ కావడంతో, ఆ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ పరీక్షల నిమిత్తం పంపించారు. మహిళలపై ఎలాంటి అసభ్య ప్రవర్తన జరిగినా కఠినంగా వ్యవహరిస్తామని, చట్ట నిబంధనల ప్రకారం తదుపరి న్యాయపరమైన చర్యలు కొనసాగుతాయని తెలంగాణ పోలీస్ శాఖ స్పష్టం చేసింది.
Admin
E Nivas News