ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ప్రభుత్వ పథకాల అమలు, గ్రామాల అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), జిల్లా విద్యాశాఖ అధికారి పి.చంద్రయ్య తెలిపారు . గురువారం మంచిర్యాల జిల్లాలోని మందమర్రి మండలం బొక్కలగుట్ట గ్రామపంచాయతీలో నిర్వహించిన గ్రామసభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ గ్రామపంచాయతీ పరిధిలో వచ్చే సంవత్సరంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనుల ప్రణాళిక సిద్ధం చేయాలని తెలిపారు. గ్రామ అవసరాలను ప్రాధాన్యత క్రమంలో గుర్తించి, ప్రజలకు ఉపయోగకరంగా ఉండే పనులను ప్రణాళికలో చేర్చాలని సూచించారు. గ్రామ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై గ్రామస్థుల అభిప్రాయాలను స్వీకరించి, అందుబాటులో ఉన్న ప్రభుత్వ వనరులను సమర్థవంతంగా వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో బ్లూ డాన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ కార్యక్రమానికి హాజరై పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఐ.పద్మజతో కలిసి విద్యార్థులకు 30 సైకిళ్లను పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలలలో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందించడంతో పాటు వారి సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందని తెలిపారు. విద్యార్థులు అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలనుసాధించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలలో మెరుగైన విద్యా వాతావరణం, నాణ్యమైన బోధన అందుతున్నందున తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలలో చేర్పించాలని తెలిపారు. విద్యార్థుల విద్యాభ్యాసానికి తోడ్పడే విధంగా బ్లూ డాన్ స్వచ్ఛంద సంస్థ సైకిళ్లను అందించి సామాజిక బాధ్యతతో వ్యవహరించడం అభినందనీయమని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి రాజేశ్వర్, మందమర్రి మున్సిపల్ కమిషనర్ టి.రాజలింగు, మండల విద్యాశాఖ అధికారి రాథోడ్ రమేష్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Admin
E Nivas News