ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : విద్యార్థి జీవితంలో పరీక్షలు ఒక అనివార్య భాగం. పరీక్షలు రాగానే చాలా మంది విద్యార్థుల్లో భయం,ఆందోళన,ఒత్తిడి కనిపిస్తాయి. ఈ భయం చదువుపై ప్రతికూల ప్రభావం చూపి, ఉన్న జ్ఞానాన్ని సైతం సరిగా ప్రదర్శించలేని పరిస్థితిని తీసుకువస్తుంది. కానీ పరీక్షల భయం శాశ్వతమైనది కాదు. సరైన అవగాహన, ప్రణాళిక, మానసిక ధైర్యంతో దీనిని అధిగమించవచ్చు. పరీక్షల భయం ప్రధానంగా అనేక కారణాల వల్ల కలుగుతుంది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పెట్టే అధిక అంచనాలు, సరిగా సిద్ధం కాలేకపోవడం, గతంలో ఎదురైన వైఫల్యాలు, ఇతరులతో పోల్చుకోవడం వంటి అంశాలు భయానికి మూలకారణాలుగా మారుతాయి. "ఫెయిల్ అయితే ఏమవుతుంది?" అనే ఆలోచన విద్యార్థి మనసును కలవరపెడుతుంది. ఈ భయం క్రమంగా నిద్రలేమి, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, ఆత్మవిశ్వాసం కోల్పోవడం వంటి సమస్యలకు దారి తీస్తుంది. పరీక్షల భయం నుంచి బయటపడాలంటే ముందుగా పరీక్షలను జీవితం కాదని, జీవితంలోని ఒక దశ మాత్రమేనని గ్రహించాలి. పరీక్షల్లో వచ్చిన మార్కులు వ్యక్తి ప్రతిభను పూర్తిగా కొలవలేవు. అనేక మంది మహానుభావులు విద్యార్థి దశలో పరీక్షల్లో విఫలమైనప్పటికీ, జీవితంలో గొప్ప విజయాలు సాధించారు. ఈ నిజాన్ని విద్యార్థులు ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. *సరైన ప్రణాళిక* సరైన ప్రణాళిక పరీక్షల భయాన్ని సగానికి తగ్గిస్తుంది. సిలబస్‌ను చిన్న చిన్న భాగాలుగా విభజించి,రోజువారీ అధ్యయన ప్రణాళిక రూపొందించుకోవాలి. చివరి రోజుకు మొత్తం చదువును వదిలిపెట్టకుండా, ముందుగానే పునశ్చరణకు సమయం కేటాయించాలి. ప్రణాళికతో కూడిన చదువు విద్యార్థిలో నమ్మకాన్ని పెంచుతుంది. చదివే విధానం కూడా చాలా ముఖ్యం. ఎక్కువ గంటలు చదవడం కన్నా అర్థం చేసుకుని చదవడం అవసరం. ముఖ్యమైన అంశాలను స్వయంగా నోట్స్‌గా రాసుకోవడం,మోడల్ పేపర్లు, పాత ప్రశ్నపత్రాలను సాధన చేయడం వల్ల పరీక్షలపై ఉన్న భయం తగ్గుతుంది. ఇలా చేయడం ద్వారా విద్యార్థి తన సిద్ధతను స్వయంగా అంచనా వేసుకోగలడు. *మానసిక స్టైర్యం* మానసిక స్థైర్యం కూడా పరీక్షల భయాన్ని జయించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. నెగెటివ్ ఆలోచనలను దూరం పెట్టాలి. "నేను చేయగలను" అనే ఆత్మవిశ్వాసం విద్యార్థిని ముందుకు నడిపిస్తుంది. శ్వాస వ్యాయామాలు,ధ్యానం వంటి సాధనాలు మనసును ప్రశాంతంగా ఉంచుతాయి. అలాగే సరైన నిద్ర, పోషకాహారం, స్వల్ప వ్యాయామం శరీరాన్ని చురుకుగా ఉంచి భయాన్ని తగ్గిస్తాయి. *తల్లిదండ్రులు....ఉపాధ్యాయుల పాత్ర* ఈ సందర్భంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పాత్ర అత్యంత ముఖ్యమైనది. పిల్లలపై అనవసర ఒత్తిడి తేవకుండా,వారి ప్రయత్నాన్ని మెచ్చుకోవాలి. మార్కులకంటే శ్రమకు ప్రాధాన్యం ఇవ్వాలి. విద్యార్థులు తమ భయాలను స్వేచ్ఛగా చెప్పుకునే వాతావరణం కల్పించాలి. అలా చేసినప్పుడు భయం క్రమంగా తగ్గిపోతుంది. *విద్యార్థి ప్రశాంతతను కలిగి ఉండటం* పరీక్ష రోజు విద్యార్థి ప్రశాంతంగా ఉండాలి. చివరి నిమిషంలో కొత్త విషయాలు చదవకుండా ఇప్పటికే తెలిసిన విషయాలపై నమ్మకం పెట్టుకోవాలి. ప్రశ్నపత్రాన్ని జాగ్రత్తగా చదివి తెలిసిన ప్రశ్నలతో ప్రారంభించాలి. సమయాన్ని సరిగ్గా వినియోగించుకుంటే పరీక్షను ధైర్యంగా ఎదుర్కోవచ్చు. *పరీక్షల భయం ఎదుర్కోవడం.....* చెప్పాలంటే పరీక్షల భయం విద్యార్థికి శత్రువు కాదు, ఒక హెచ్చరిక మాత్రమే. సరైన సిద్ధత, ఆత్మవిశ్వాసం, మానసిక స్థైర్యంతో ప్రతి విద్యార్థి ఈ భయాన్ని జయించగలడు.పరీక్షలు మన విలువను నిర్ణయించవు, మన ప్రయత్నాన్ని మాత్రమే పరీక్షిస్తాయి. ఈ భావనను హృదయంలో నిలుపుకుంటే విద్యార్థి నిర్భయంగా ముందుకు సాగగలడు. --డా.ఓర్సు రాయలింగు 9849446027
Admin
E Nivas News