ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : మంథని మండలం లక్ష్మీపురంలో ల్యాండ్ మార్క్ రీజన్ అగ్రి (ఎల్.ఆర్.ఏ) ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో శనివారం రైతులకు అవగాహన, శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎల్.ఆర్.ఏ ప్రాజెక్ట్ ఫీల్డ్ ఆఫీసర్ ఎస్. రాజశేఖర్ మాట్లాడుతూ పత్తి సాగులో అంతర్ పంటల ప్రాముఖ్యత, సహజ కషాయాల తయారీ, వినియోగం గురించి వివరించారు. భూసార పరీక్షల ఆధారంగా మాత్రమే ఎరువులు వేయాలని, 4ఆర్ పద్ధతులను పాటించాలని సూచించారు. పత్తి పంటలో 45 రోజుల వరకు ఎలాంటి పురుగు మందులు పిచికారీ చేయవద్దని, అత్యంత విషపూరితమైన పురుగు మందులను అసలు వాడవద్దని రైతులకు స్పష్టం చేశారు. అదే సమయంలో వ్యవసాయంతో పాటు ఆగ్రోఫారెస్ట్రీ ప్లాంటేషన్ చేపట్టాలని పిలుపునిచ్చారు. కూలీల ఆరోగ్య భద్రతపై అవగాహన కల్పిస్తూ, పురుగు మందులు పిచికారీ చేసే సమయంలో తప్పనిసరిగా పి.పి.ఇ కిట్ ధరించాలని, ఇంటి వద్దగానీ, చేను వద్దగానీ ప్రథమ చికిత్స పెట్టె (బాక్స్) అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. అలాగే కూలీల వివరాలను రికార్డు చేయాలని రైతులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చెరుకు తోట సురేష్, ఫీల్డ్ ఆఫీసర్లు సి.హెచ్. మహేష్, ప్రశాంత్ రాజు తో పాటు గ్రామ రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Admin
E Nivas News