ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : పట్టణ ప్రజలకు మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఐటి, పరిశ్రమలు, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు అన్నారు. సోమవారం మంత్రి శ్రీధర్ బాబు మంథని ప్రాంతంలో విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి పనులు, కమ్యూనిటీ హాల్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం శివ కిరణ్ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన పబ్లిక్ మీటింగ్ లో పాల్గొన్న మంత్రి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రోసిడింగ్ కాపీలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో పెద్ద ఎత్తున తమ హాయంలో ఇందిరమ్మ ఇండ్లు పేదలకు మంజూరు చేశామన్నారు. నేడు మరో 317 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ చేయడం సంతోషంగా ఉందని, ఎల్ 2 లబ్ధిదారులుగా ఎంపికైన 298 దరఖాస్తులు, ఎల్ 3 దరఖాస్తులు పరిశీలించి మరో 300 మంది ఇండ్లు లేని నిరుపేదలను ఎంపిక చేసి ఇందిరమ్మ ఇండ్లు పంపిణీ చేసినందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఎల్ 1 గా ఎంపికైన ఇందిరమ్మ ఇండ్లు ప్రోసిడింగ్స్ అందుకున్న లబ్ధిదారులకు 4 విడుతలలో 5 లక్షల రూపాయల ప్రభుత్వ సహాయం నేరుగా బ్యాంకు ఖాతాల ద్వారా అందుతుందని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల కోసం ఎవరికీ రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదని, ఇందిరమ్మ ఇండ్లలో ఎటువంటి అవినీతి ఆస్కారం లేదని, ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు చిన్న ఫిర్యాదు అందిన కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆర్డిఓ ను ఆదేశించారు. 317 మంది లబ్ధిదారులు మరో 5 నెలలో ఇండ్లు పూర్తి చేసుకుని గృహ ప్రవేశం చేసుకోవాలని, ప్రభుత్వం ప్రతి వారం నిధులు విడుదల చేస్తుందని అన్నారు. ఇంటి నిర్మాణానికి ఎటువంటి సహాయం అవసరం ఉన్న అధికారులు, స్థానిక నాయకులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలని మంత్రి తెలిపారు. మంథని లో ఉన్న పేదలందరికీ విడుతల వారీగా తప్పనిసరిగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని మంత్రి పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూ మరో రెండు మూడు నెలల్లో నూతన ఫించన్ మంజూరు పై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని మంత్రి తెలిపారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తరువాత మంథని పట్టణంలో 37 కోట్ల రూపాయలు ఖర్చు చేసి సిసి రోడ్లు, డ్రైయిన్ నిర్మాణ పనులు పూర్తి చేసుకున్నామని తెలిపారు. మంథని పట్టణంలో దాదాపు 10 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ అన్ని వర్గాలకు కమ్యూనిటీ హాల్స్ నిర్మాణానికి నేడు శంకుస్థాపన చేసుకున్నామని, పట్టణంలో పెండింగ్ సీసీ రోడ్లు, డ్రైయిన్ల నిర్మాణ పనులకు 22 కోట్ల రూపాయలను నేడు మంజూరు చేశామని, త్వరలో ఈ పనులు ప్రారంభం అవుతాయన్నారు.
మంథని ఆర్టీసీ డిపో నుంచి పాత పేట్రోల్ బంక్ వరకు రోడ్డు విస్తరణ వరకు 15 కోట్ల రూపాయలు, సెంట్రల్ లైటింగ్ కొరకు కోటి 20 లక్షల రూపాయలు, అంబేద్కర్ చౌరస్తా నుంచి గాంధీ విగ్రహం వరకు రోడ్డు వెడల్పు పనులకు 50 లక్షల రూపాయలు, బోక్కల వాగు ఇరువైపులా లైటింగ్ కొరకు 30 లక్షల రూపాయలు, శ్రీపాద కాలనీ నుంచి పోచమ్మ గుడి వరకు 22 లక్షలతో సిసి రోడ్డు నిర్మాణ పనులకు మంజూరు చేసుకున్నామని తెలిపారు. మనం చేసే అభివృద్ధి సంక్షేమమే ఇతరులకు సమాధానంగా ఉండాలని, రాజకీయంలో వ్యక్తిగతంగా మాట్లాడటం పద్దతి కాదని మంత్రి హితవు పలికారు. పేద ప్రజలకు శాచురేషన్ పద్ధతిలో నూతన రేషన్ కార్డులు మంజూరు చేసి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి నెలకు 6 కిలోల సన్న బియ్యం అందిస్తున్నామని అన్నారు. పేద ప్రజలకు నెలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు సరఫరా చేస్తూ జీరో బిల్ అందిస్తున్నామని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, పేదలకు ఇందిరమ్మ ఇండ్లు పంపిణీ చేస్తున్నామన్నారు. గత పాలకుల హయాంలో రేషన్ కార్డులో నూతన పేరు చేర్చుకోవడం కూడా చేయలేదని మంత్రి విమర్శించారు. మంథని పట్టణంలోని ఆటో సోదరుల కోసం ప్రత్యేకంగా ఆటోనగర్ ఏర్పాటుకు అవసరమైన భూమి గుర్తించే కార్యక్రమాన్ని రెవెన్యూ డివిజన్ అధికారి చేపట్టారని త్వరలోనే ఆటోనగర్ ఏర్పాటుకు అనువైన భూమి ఎంపిక చేసి ఇంటి స్థలాలు అందిస్తామని మంత్రి తెలిపారు. పేదల సంక్షేమం అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న ప్రభుత్వాన్ని ప్రోత్సహిస్తూ ప్రజలు ఆశీర్వదించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ తప్పనిసరిగా నెరవేరుస్తామని మంత్రి పేర్కొన్నారు. మంత్రి శ్రీధర్ బాబు మంథని కుచిరాజుపల్లి లో 4.5 కోట్ల రూపాయలతో నిర్మించనున్న ఆర్ &బీ గెస్ట్ హౌస్ నిర్మాణ పనులకు, 20 లక్షల రూపాయలతో నిర్మించనున్న బస్టాండ్, 30 లక్షల రూపాయలతో నిర్మించిన ఈద్గా నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. మంథని పట్టణం పరిధిలో 8 కోట్ల 5 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టిన వివిధ వర్గాలకు చెందిన 28 కమ్యూనిటీ హాల్స్ నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఎరుకల గూడెం రోడ్డు నుంచి సి.ఆర్.కే అపార్ట్మెంట్స్ నుంచి అయ్యప్ప టెంపుల్ రోడ్డు వరకు కోటి 89 లక్షల రూపాయలతో చేసిన రోడ్డు నిర్మాణ పనులను, పాత అబ్కారీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన డే కేర్ సెంటర్ ను మంత్రి ప్రారంభించారు. పెంచికల్ పేట్ నుంచి కమాన్ పూర్ రోడ్డు వరకు 14 కోట్లతో చేస్తున్న రోడ్డు విస్తరణ పనులకు, మూడు కోట్ల రూపాయలతో చేపట్టిన గుడదం రాజాపూర్ బ్రిడ్జి నిర్మల పనులకు, 10 లక్షల రూపాయలతో చేపట్టిన గంగాపురి బస్ స్టాండ్ నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం కల్యాణ లక్ష్మి ,సి ఏం ఆర్ ఎఫ్ చెక్కులను మంత్రి సంబంధిత అధికారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంథని ఆర్డీఓ సురేష్, మున్సిపల్ కమిషనర్ మనోహర్, తహసీల్దార్ కుమార స్వామి, పిడి హౌసింగ్ రాజేశ్వరరావు, ప్రజా ప్రతినిధులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News