ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో భాగంగా చేపట్టిన భూ సేకరణలో పరిహారం చెల్లింపు ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర నీటిపారుదల, ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి తెలిపారు . మంగళవారం హైదరాబాద్ నుండి నీటిపారుదల శాఖ కార్యదర్శి ఈ శ్రీధర్ తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, అధికారులతో భూసేకరణ, పునరావాసం–పునరావాస పునరుద్ధరణ, అటవీ అనుమతులు అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ భూసేకరణ పరిహారం చెల్లింపులకు సంబంధించి అమలులో ఉన్న నిబంధనలు, ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అర్హతలను పరిశీలించి జిల్లాల వారీగా అర్హుల జాబితాను సిద్ధం చేయాలని తెలిపారు. అర్హత కలిగిన భూ నిర్వాసితులకు,భూ యజమానులకు పరిహారం చెల్లింపుల ప్రక్రియను నిబంధనల ప్రకారం వేగంగా పూర్తి చేయాలని, ఇంజనీర్ లు సంబంధిత శాఖల సమన్వయంతో వేగవంతంగా పని చేయాలని తెలిపారు. ఈ సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ పరిహారం చెల్లింపుల కోసం సుమారు 6 వేల కోట్ల రూపాయల నిధులను విడుదల చేయనున్నందున, అర్హత కలిగిన కేసులను గుర్తించి, అవసరమైన ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. భూసేకరణ పరిహారం చెల్లింపులకు సంబంధించి ప్రతి కేసుకు టోకెన్ నంబర్ జనరేట్ చేసి, చెల్లింపుల ప్రక్రియను పారదర్శకంగా, క్రమబద్ధంగా నిర్వహించాలని తెలిపారు. భూసేకరణ పరిహారం చెల్లింపులు, అర్హత నిర్ధారణ, ఇతర సాంకేతిక,పరిపాలనా సమస్యలు ఎదురైన పక్షంలో సంబంధిత అధికారులు ప్రధాన కార్యాలయాన్ని సంప్రదించి సమస్యలను వెంటనే పరిష్కరించుకోవాలని తెలిపారు. నీటిపారుదల శాఖ అధికారులు, రెవెన్యూ శాఖ అధికారుల సమన్వయంతో అవసరమైన చర్యలు చేపట్టాలని, పి.డి. ఖాతాలో ఉన్న నిధులను వెంటనే భూ యజమానులకు చెల్లింపులు చేయాలని తెలిపారు. భూసేకరణ, ఆర్ & ఆర్, అటవీ భూములకు సంబంధించిన పెండింగ్ అంశాలను నిర్దేశిత కాలవ్యవధిలో పరిష్కరించి అభివృద్ధి ప్రాజెక్టుల పనులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాల వారీగా భూసేకరణ పురోగతి, పరిహారం చెల్లింపులు, ఆర్ & ఆర్ చర్యలు, అటవీ భూములకు సంబంధించిన అనుమతులు, పెండింగ్ సమస్యపై సమీక్షించారు. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు, కాలువల నిర్మాణంలో భాగంగా సేకరించిన భూముల యజమానులకు నష్టపరిహారం, పునరావాసం కల్పించడం, అటవీ శాఖ సంబంధిత అనుమతుల పనుల వేగవంతానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ మహమ్మద్ విలాయత్ అలీ, భూ సేకరణ, నీటిపారుదల శాఖల అధికారులు,సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News