ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుడి పాత్ర అత్యంత కీలకమైనది. "తల్లిదండ్రులు శరీరాన్ని ప్రసాదిస్తే, ఉపాధ్యాయుడు వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాడు". విలువలు, విజ్ఞానం, క్రమశిక్షణ, బాధ్యత వంటి మూలాధారాలను విద్యార్థి మనస్సులో నాటే శక్తి ఉపాధ్యాయుడికే ఉంటుంది. అలాంటి ఉపాధ్యాయుడి అధికారం క్రమంగా క్షీణించిన రోజే సమాజం తన భవిష్యత్తు పునాదులను బలహీనపరిచినట్లే అవుతుంది. *ఉపాధ్యాయుడి అధికారం అర్థం మరియు అవసరం* ఉపాధ్యాయుడి అధికారం అంటే భయపెట్టే శక్తి కాదు. అది గౌరవంతో కూడిన నైతిక బలం. విద్యార్థులు ఉపాధ్యాయుని మాటను విశ్వసించి ఆయన సూచనలను అనుసరించే స్థితి. ఈ అధికారం వల్లే తరగతి గదిలో క్రమశిక్షణ నెలకొంటుంది. విద్యార్థుల్లో నేర్చుకోవాలనే తపన పెరుగుతుంది. అధికారం లేని విద్య కేవలం సమాచార మార్పిడిగా మిగిలిపోతుంది, అది వ్యక్తిత్వ వికాసంగా మారదు. *అధికారం కూలిపోవడానికి కారణాలు* ఆధునిక కాలంలో ఉపాధ్యాయుడి స్థానాన్ని అనేక అంశాలు దెబ్బతీశాయి. మొదటిగా విద్య వ్యాపారంగా మారడం. ఫీజులు చెల్లిస్తున్నాం కాబట్టి ఉపాధ్యాయుడు సేవకుడన్న భావన కొందరిలో పెరిగింది. రెండవది, తల్లిదండ్రుల అతిశయ జోక్యం. పిల్లల తప్పులను సరిదిద్దాల్సిన చోట ఉపాధ్యాయులనే ప్రశ్నించడం మొదలైంది. మూడవది, సాంకేతిక విజ్ఞానం దుర్వినియోగం. గూగుల్‌లో అన్నీ దొరుకుతాయన్న భావనతో ఉపాధ్యాయుడి అనుభవానికి విలువ తగ్గింది. నాలుగవది, వ్యవస్థాపక వైఫల్యం. ఉపాధ్యాయుల రక్షణకు స్పష్టమైన విధానాలు లేకపోవడం వల్ల వారి స్వేచ్ఛ, ధైర్యం తగ్గాయి. *విద్యార్థులపై ప్రభావం* ఉపాధ్యాయుడి అధికారం తగ్గినప్పుడు మొదట నష్టపోయేది విద్యార్థులే. క్రమశిక్షణ లేకుండా పెరిగిన విద్యార్థులు బాధ్యతను అర్థం చేసుకోలేరు. శ్రమ,సహనం,గౌరవం వంటి విలువలు అలవడవు. ఫలితంగా వారు మంచి ఉద్యోగం పొందవచ్చు గానీ, మంచి పౌరులుగా మారడం కష్టం అవుతుంది. విలువలేని విజ్ఞానం సమాజానికి ప్రమాదకరంగా మారుతుంది. *సమాజంపై దీర్ఘకాల ప్రభావం* నేటి విద్యార్థులే రేపటి నాయకులు, ఉద్యోగులు, శాస్త్రవేత్తలు, పాలకులు. ఉపాధ్యాయుని గౌరవించని తరం రేపు చట్టాన్ని, నైతికతను కూడా గౌరవించదు. అవినీతి, అసహనం, హింస వంటి సమస్యలు పెరుగుతాయి. సమాజంలో మేధస్సు పెరిగినా మానవత్వం తగ్గిపోతుంది. ఇదే నిజమైన భవిష్యత్ *పరిష్కార మార్గాలు* ఉపాధ్యాయుడి అధికారం తిరిగి స్థాపించాలంటే సమిష్టి ప్రయత్నం అవసరం. తల్లిదండ్రులు ఉపాధ్యాయుడిని భాగస్వామిగా చూడాలి, శత్రువుగా కాదు. విద్యా వ్యవస్థ ఉపాధ్యాయులకు చట్టపరమైన రక్షణ, గౌరవం కల్పించాలి. ఉపాధ్యాయులు కూడా తమ ప్రవర్తన, నైతికత ద్వారా గౌరవాన్ని సంపాదించాలి. విద్యార్థుల్లో చిన్ననాటి నుంచే గురుగౌరవ భావనను పెంపొందించాలి. "ఉపాధ్యాయుడి అధికారం కూలిన రోజే సమాజం తన భవిష్యత్తును చంపుకుంది" అనే వాక్యం అతిశయోక్తి కాదు, అది కఠినమైన సత్యం. ఉపాధ్యాయుడి గౌరవం నిలిచినప్పుడే విద్యకు అర్థం, సమాజానికి దిశ ఉంటుంది. గురువును కాపాడుకోవడం అంటే మన భవిష్యత్తును కాపాడుకోవడమే. మనిషి కేవలం జీవశాస్త్రీయ ప్రాణి మాత్రమే కాదు, అతడు విలువలతో, చైతన్యంతో, ఆలోచనలతో కూడిన సాంఘిక సత్త. ఆ సత్తను తీర్చిదిద్దే శక్తే విద్య. విద్యకు ఆత్మ ఉపాధ్యాయుడు. గురువు లేకుండా విద్య కేవలం సమాచారం మాత్రమే, గురువు ఉన్నప్పుడు అది జీవన తత్వంగా మారుతుంది. అలాంటి ఉపాధ్యాయుడి అధికారం కూలిపోవడం అంటే సమాజం తన ఆత్మను కోల్పోవడమే. *అధికారం అంటే ఏమిటి? భయంకాని బోధ* తాత్వికంగా చూస్తే అధికారం అనేది శాసన శక్తి కాదు, అది నైతిక ఆమోదం. విద్యార్థి తన అంతరాత్మతో ఉపాధ్యాయుడిని అంగీకరించినప్పుడు ఏర్పడే బంధమే నిజమైన అధికారం. ఉపనిషత్తుల్లో గురువు శిష్యుని దగ్గరకు "శ్రద్ధావాన్ లభతే జ్ఞానం" అని చెబుతాడు. శ్రద్ధ లేకపోతే జ్ఞానం ఫలించదు. ఆ శ్రద్ధకు మూలం గురువు అధికారం. ఉదాహరణకు ఒక గ్రామ పాఠశాలలో ఒక గురువు మాటంటే గ్రామమే గౌరవించేది.ఆయన ఒక్క చూపుతోనే విద్యార్థి తన తప్పు తెలుసుకునేవాడు. అక్కడ కఠిన శిక్షలు లేవు, కానీ గౌరవం ఉంది. ఆ గౌరవమే అధికారం. *గురు శిష్య సంప్రదాయం మరియు దాని పతనం* భారతీయ తాత్విక సంప్రదాయంలో గురువు బ్రహ్మతో సమానం. "గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః" అన్న శ్లోకం గురువును దేవుడిగా నిలబెట్టలేదు.జ్ఞానసృష్టికర్తగా గుర్తించింది. ఈ సంప్రదాయం కూలినప్పుడు, జ్ఞానం పవిత్రత కోల్పోయింది. ఉదాహరణకుఅరణ్యాలలో నివసించిన గురుకులాలలో శిష్యుడు కేవలం విద్యనే కాదు, వినయం, సహనం, సేవాభావం నేర్చుకున్నాడు. నేటి తరగతి గదిలో విద్యార్థి మార్కుల కోసం చదువుతున్నాడు. మనిషిగా మారడానికి కాదు. *అధికారం కూలిపోతే ఏమి మిగులుతుంది?* ఉపాధ్యాయుడి అధికారం కూలినప్పుడు, మూడు ప్రమాదకర పరిస్థితులు ఏర్పడతాయి: విద్యార్థి కేంద్రం మారుతుంది. జ్ఞానం నుంచి స్వేచ్ఛావాదానికి. తప్పు సరి మధ్య గీత చెరిగిపోతుంది. విలువల స్థానంలో హక్కుల చర్చ వస్తుంది. ఉదాహరణకు ఒక విద్యార్థి తరగతిలో శబ్దం చేస్తే, ఉపాధ్యాయుడు హెచ్చరిస్తే, వెంటనే "నా హక్కులు" అనే మాట వినిపిస్తుంది. కానీ బాధ్యతల గురించి ప్రశ్నించేవారు తగ్గిపోయారు. ఇది అధికారం కూలిన సంకేతం. ఉపాధ్యాయుడు మౌనంగా మారిన రోజు ఉపాధ్యాయుడికి అధికారం లేకపోతే అతడు బోధించగలడు గానీ దిశానిర్దేశం చేయలేడు. అతడు పాఠ్యాంశాన్ని పూర్తి చేస్తాడు; కానీ వ్యక్తిత్వాన్ని మలచలేడు. ఈ మౌనం అత్యంత ప్రమాదకరం. ఉదాహరణకు ఒక ఉపాధ్యాయుడు విద్యార్థి తప్పుదారిలో వెళ్తున్నాడని తెలిసినా, "నాకు సమస్యలు వస్తాయి" అన్న భయంతో మౌనంగా ఉంటే ఆ మౌనం ఒక జీవితాన్ని నాశనం చేస్తుంది. *సమాజం తన భవిష్యత్తును ఎలా చంపుకుంటుంది* నేటి విద్యార్థి రేపటి పాలకుడు. గురువును ప్రశ్నించినవాడు రేపు చట్టాన్నీ ప్రశ్నిస్తాడు. గురువును అవమానించినవాడు రేపు న్యాయవ్యవస్థనూ అవమానిస్తాడు. ఇది శ్రేణి ప్రభావం. ఉదాహరణగా చరిత్రలో మనకు కనిపిస్తుంది. విలువలతో పెరిగిన తరం దేశాన్ని నిర్మించింది. విలువలేని మేధస్సు దేశాన్ని విభజించింది. చదువున్నవారు చేసిన అవినీతే దీనికి సాక్ష్యం. పరిష్కారం, అధికారం కాదు. *ఆత్మ పునరుద్ధరణ* ఇక్కడ ఉపాధ్యాయుడికి అధికారాన్ని 'ఇవ్వాలి' అనడం సరైన మాట కాదు. అది పునరుద్ధరించాలి. గౌరవం చట్టంతో రాదు. అది సంస్కారంతో వస్తుంది. తల్లిదండ్రులు పిల్లలకు "గురువు శత్రువు కాదు, మార్గదర్శి" అని చెప్పాలి. ఉపాధ్యాయుడు తన జీవితం ద్వారా తత్వాన్ని బోధించాలి. విద్యా వ్యవస్థ విలువల ఆధారిత విద్యను ప్రోత్సహించాలి. "ఉపాధ్యాయుడి అధికారం కూలిన రోజే సమాజం తన భవిష్యత్తును చంపుకుంది" అన్న వాక్యం ఒక హెచ్చరిక. అది ఉపాధ్యాయుడి గురించికాదు; మన సంస్కృతి, మన విలువల గురించిది. గురువును నిలబెట్టుకున్న సమాజమే నిలబడుతుంది. గురువును కోల్పోయిన సమాజం చరిత్రలో హెచ్చరికగా మాత్రమే మిగులుతుంది. --డా.ఓర్సు రాయలింగు 9849446027
Admin
E Nivas News