ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : మంథని పట్టణంలో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. శనివారం మంథని పట్టణంలో నిర్మించనున్న మార్కెట్ ఏరియాను, సమీకృత ప్రభుత్వ కార్యాలయాల సముదాయాన్ని, నూతనంగా నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి, రావులచెరువు పునరుద్ధరణ పనులు, డ్రైనేజీ నిర్మాణ పనులను కలెక్టర్ కోయ శ్రీహర్ష క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం వర్షాలు లేకపోవడంతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని, ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకొని అన్ని పనులను వేగవంతం చేయాలని సూచించారు. పనుల్లో ఎలాంటి జాప్యానికి తావివ్వకుండా నిర్ణీత గడువులోపు నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మంథనిలో నిర్మిస్తున్న మార్కెట్ ఏరియా, సమీకృత ప్రభుత్వ కార్యాలయాల సముదాయం, మార్కెట్ ఏరియాలో వంద ఫీట్ల రోడ్డు, ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను నిరంతరం పర్యవేక్షిస్తూ వేగంగా పూర్తి చేయాలన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించే విధంగా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. రావుల చెరువు పునరుద్ధరణ పనులను నాణ్యతతో పూర్తి చేసి చెరువును సంరక్షించేలా చర్యలు చేపట్టాలని, డ్రైనేజీ నీరు చెరువులోకి చేరకుండా శాశ్వత ప్రాతిపదికన డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం హరే కృష్ణ గోదాముల ఏర్పాటును పరిశీలించిన కలెక్టర్, జిల్లాలోని సుమారు 40 వేల మంది విద్యార్థులకు ప్రతిరోజూ అల్పాహారం, భోజనం అందించే కార్యక్రమానికి అవసరమైన మౌలిక వసతులు, నిల్వ సదుపాయాలు, పంపిణీ ఏర్పాట్లు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పనులను వేగంగా పూర్తి చేసి కార్యక్రమాన్ని సకాలంలో ప్రారంభించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ పరిశీలనలో మంథని మున్సిపల్ చైర్మన్ వొడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ సయేందర్ రెడ్డి, కౌన్సిలర్ పెంటరాజు, ఆర్డీవో సురేష్, తహసిల్దార్ ఆరిఫుద్దీన్, మున్సిపల్ కమిషనర్ మనోహర్, సంబంధిత శాఖల అధికారులు, ఇంజినీర్లు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News