ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ / మరిపెడ, ఉప్పుల రమేష్ : క్రీడలు మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి దోహదపడతాయని సర్పంచ్ అజ్మీరా రవి నాయక్, ఐసిడిఎస్ సూపర్ వైజర్ కవిత కుమారి అన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా మరిపెడ మండలం అజ్మీరా తండా గ్రామ పంచాయతీలో మహిళలకు ముగ్గుల పోటీలు, పిల్లలకు కుర్చీలు, రన్నింగ్ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై పోటీల్లో గెలుపొందిన విజేతలకు ప్రథమ బహుమతి రైస్ కుక్కర్, ద్వితీయ బహుమతి, సీలింగ్ ఫ్యాన్, తృతీయ బహుమతి పప్పు కుక్కర్ లను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. క్రీడలు నేటి సమాజంలోని యువతకు మానసిక ఉల్లాసాన్ని ఇవ్వడంతో పాటు స్నేహ సంబంధాలను పెంపొందించుకునేందుకు దోహదం చేస్తాయన్నారు. యువత శారీరకంగా, మానసికంగా దృఢంగా ఎదగాలంటే క్రీడలు ఎంతో అవసరమని అన్నారు. క్రీడల ద్వారా యువతలో క్రమశిక్షణ, ఐక్యత, నాయకత్వ లక్షణాలు అలవడతాయన్నారు. జీవితంలో స్థిర పడాలన్నా, ఉద్యోగాలు సంపాదించాలన్నా, భవిష్యత్‌లో స్పోర్ట్స్ కోటా ఉంటుందని తెలిపారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, క్రీడాకారులు ఓటమిని రేపటికి గెలుపు కోసం స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మరిపెడ మండల ఎస్టీ సెల్ అధ్యక్షులు అజ్మీర శ్రీను నాయక్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అజ్మీర కిషన్ నాయక్, మండల మహిళ సమైక్య అధ్యక్షురాలు వసంత శ్రీను నాయక్, మాజీ సర్పంచ్ కొండూరు వెంకన్న, సూరారపు వెంకన్న, ధరావత్ శ్రీను, వార్డు సభ్యులు, పెద్దలు, మహిళలు, యువతీయువకులు, తాండవాసులు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News