ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో / కొండపర్తి ప్రసన్నకుమార్ : దుబ్బాక నియోజకవర్గానికి చెందిన మార్కెట్ కమిటీ చైర్మెన్ మరియు సభ్యుల ప్రమాణ స్వీకారం, సన్మాన కార్యక్రమంలో మంగళవారం కార్మిక మరియు గనుల శాఖ మంత్రి డా. వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన చైర్మెన్, సభ్యులకు మంత్రి అభినందనలు తెలియజేశారు. దుబ్బాక మున్సిపాలిటీలోని 20 వార్డులలో టీఐఎఫ్‌డీసీ నిధుల ద్వారా రూ.50 లక్షలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీల అభివృద్ధికి టీఐఎఫ్‌డీసీ ద్వారా రూ.10 కోట్ల నిధులు కేటాయించిందని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో టీఐఎఫ్‌డీసీ నిధులు ఉన్నాయని అబద్ధాలు చెబుతూ రూ.8 లక్షల కోట్ల అప్పులు చేసిందని విమర్శించారు. మున్సిపాలిటీలకు నిధులు కేటాయించి అభివృద్ధి చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టమైన చర్యలు తీసుకుంటోందని అన్నారు. మహిళా రుణాలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, రూ.2 లక్షల రుణ మాఫీ అందని వారి వివరాలను లిస్టు ఇవ్వాలని సూచించారు. సన్న బియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, గ్యారంటీ కార్డులు ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమయ్యాయని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
E Nivas News