ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తల్లిదండ్రుల సంరక్షణ చట్టం బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆదివారం ఆమోద ముద్ర వేసింది. దాంతో ప్రభుత్వ ఉద్యోగుల జవాబుదారీతనం బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. తల్లిదండ్రులను పట్టించుకోని ఉద్యోగి వేతనం నుంచిరూ.10 వేల వరకు నేరుగా తల్లిదండ్రుల ఖాతాలో జమయ్యేలా ఈ బిల్లును తీసుకువచ్చారు. ఈ చట్టం పరిధిలోకి ఉద్యోగులు, ప్రజాప్రతినిధులను తీసుకువస్తూ ఈ బిల్లుకు ఆమోద ముద్ర వేశారు.తల్లిదండ్రుల హక్కులు కాపాడాలన్నదే నా ధ్యేయం అన్నారు. అంతకుముందు తల్లిదండ్రుల సంరక్షణ చట్టం బిల్లుపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ తల్లిదండ్రుల కోసం సామాజిక బాధ్యతగా చట్టం తీసుకు వచ్చామన్నారు. తల్లిదండ్రుల హక్కులు కాపాడాలనే చట్టం తెచ్చామని స్పష్టం చేశారు. సమాజం తలదించుకునేలా కొందరు పిల్లలు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మీయతకు సంబంధించిన అంశంపై బిల్లు తేవడం బాధాకరమేనని తెలంగాణ సీఎం పేర్కొన్నారు. పిల్లలు భక్తితో కాకపోయినా భయంతోనైనా తల్లిదండ్రులను చూసుకోవాలన్నదే తమ ప్రయత్నమని స్పష్టం చేశారు.పిల్లల కోసం తల్లిదండ్రులు తమ శక్తినంతా ధారపోస్తారని వివరించారు. పిల్లలు మాత్రం రెక్కలు వచ్చాక తల్లిదండ్రులను పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. తల్లిదండ్రులకు అండగా నిలవాలనే ఈ చట్టం తీసుకొచ్చామని సీఎం రేవంత్ వివరించారు. తల్లిదండ్రుల యోగక్షేమాలు చూడని వారిని సామాజికంగా బహిష్కరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 2007లో వృద్ధుల కోసం కేంద్రం ఒక చట్టం తీసుకొచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. కేంద్ర చట్టం ప్రకారం తల్లిదండ్రులకు రూ.10 వేలకు మించకుండా ఇవ్వాలని అందులో ఉందని తెలిపారు. అందుకే తాము తెచ్చిన చట్టంలో రూ.10 వేల నిబంధన పెట్టినట్లు సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. తాము తెచ్చిన చట్టం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే కాదని,ప్రజా ప్రతినిధులకూ సైతం వర్తిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ చర్చలో రామాయణంలోని శ్రావణకుమారుడి కథతోపాటు రేమాండ్స్ సంస్థ మాజీ అధినేత విజయ్ పథ్ సింఘానియా జీవితంలో చోటు చేసుకున్న పరిణామాలను సీఎం రేవంత్ రెడ్డి క్లుప్తంగా వివరించారు.
Admin
E Nivas News