ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : ఆసుపత్రికి వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమీషనర్ డాక్టర్ అజయ్ కుమార్ తెలిపారు . గురువారం సాధారణ తనిఖీల్లో భాగంగా పట్టణంలోని 30 పడకల ఆసుపత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రిలో వైద్య సేవలు ఎలా అందుతున్నాయనే వివరాలను స్వయంగా రోగులను అడిగి తెలుసుకున్నట్టు తెలిపారు. ఓ పీ, ఐ పీ ల సంఖ్య గతంలో కంటే ఎక్కువగా పెరిగిందని వివరించారు. అంతేకాకుండా ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య పెరిగినట్లు వెల్లడించారు. ముఖ్యంగా ఉద్యోగుల హాజరును పరిశీలించినట్లు తెలిపారు. అంతేకాకుండా రాత్రి వేళల్లో విధులు నిర్వహణపై వివరాలు సేకరించినట్లు వివరించారు.ల్యాబ్, స్కానింగ్ ఇతర సేవలు అందుబాటులో ఉన్నాయని రోగులకు తెలిపారన్నారు. ఆసుపత్రి పరిశుభ్రత విషయంలో మరింత శ్రద్ధ పెట్టాలని సూచించారు.రోగులకు అన్ని సేవలు అందుతాయని ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. త్వరలోనే ఆసుపత్రి ఖాళీగా ఉన్నటువంటి వైద్యుల పోస్ట్ లను భర్తీ చేస్తామని తెలిపారు. ఈ ఆకస్మిక తనిఖీలో ఆయన వెంట ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఆకుల శ్రీనివాస్, వైద్యులు, సిబ్బంది ఉన్నారు.
Admin
E Nivas News