ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : యూవజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు సాదుల శ్రీకాంత్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు మంథని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ సార్, ప్రజా యుద్ధనౌక గద్దర్ లకు నివాళులర్పించారు. ఈ సందర్బంగా మంథని మున్సిపల్ చైర్మన్ వొడ్నాల శ్రీనివాస్, ఏఎంసి ఛైర్మన్ కుడుదుల వెంకన్న, ఆర్టీఎ మెంబెర్ మంథని సురేష్, ఎస్సి సెల్ డివిజన్ అధ్యక్షులు మంథని సత్యంలు మాట్లాడుతూ బెనారస్, అలీగఢ్ విశ్వవిద్యాలయాల నుంచి ఆర్థికశాస్త్రంలో పట్టా అందుకున్న జయశంకర్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ చేసి 1975 నుంచి 1979 వరకు వరంగల్ సీకేఎం కళాశాల ప్రిన్సిపాల్‌గా, 1979 నుంచి 1981 వరకు కాకతీయ విశ్వవిద్యాలయం రిజస్ట్రార్‌గా, 1982 నుంచి 1991 వరకు సీఫెల్ రిజిస్ట్రార్‌గా, 1991 నుంచి 1994 వరకు అదే యూనివర్శిటీకి ఉపకులపతిగా పని చేసి అధ్యాపకుడిగా ఆయన ఎంతో మందికి మార్గనిర్దేశం చేశాడన్నారు. వృత్తి పట్ల నిబద్ధతను, తెలంగాణ ఉద్యమం పట్ల చిత్తశుద్ధిని వారిలో నూరిపోశారు. ఎమర్జెన్సీ కాలంలో ఆయన సీకేఎం కళాశాలకు ప్రిన్సిపల్‌గా పనిచేశారన్నారు. సీకేఎం కళాశాల అంటేనే జిల్లాలో విప్లవ విద్యార్థి ఉద్యమానికి కేంద్రంగా అప్పట్లో పేరుండేందని, విప్లవ కవి వరవరరావు లాంటి వాళ్లు ఆ కళాశాలలో అధ్యాపకులుగా చేశారన్నారు. ఎమర్జెన్సీ రోజుల్లో ఆయన కళాశాలను నడిపి ఎంతో మంది విద్యార్థుల్ని, అధ్యాపకుల్ని నిర్బంధం నుంచి కాపాడారన్నారు. ఆయన అధ్యాపకుడిగా హన్మకొండలోని మల్టీపర్సస్ స్కూల్లో మొదట తెలుగు బోధించారన్నారు. ఒక అధ్యాపకున్ని విద్యార్థులు గుర్తుపెట్టుకోవడం సర్వసాధారణమే కానీ ఒక అధ్యాపకుడే తన విద్యార్థులందరిని గుర్తుపెట్టుకొని పేరుపెట్టి పిలవడం ఒక్క జయశంకర్ సార్ కే సాధ్యమన్నారు. తెలంగాణ మలి ఉద్యమంలో గద్దర్ మరోసారి వెనుకబడిన కులాలు, నిమ్న కులాల ఉద్ధరణ ఉద్దేశంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కోసం తన మద్దతును తెలిపాడన్నారు. బలమైన కమ్యూనిస్ట్ భావజాలం ఉన్నప్పటికీ, అతను ప్రత్యేక తెలంగాణా రాష్ట్రాన్ని వ్యతిరేకించే కొన్ని కమ్యూనిస్ట్ పార్టీలతో తన భావాలను పంచుకోలేదని, గద్దర్ మొదటి నుండి తెలంగాణా కోసం అనేక పాటలు పాడారన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ మంథని మున్సిపల్ వైస్ చైర్మన్, ప్రజా ప్రతినిధులు, మున్సిపల్ కౌన్సిలర్లు, గ్రామ సర్పంచ్ లు, గ్రామ ఉప సర్పంచ్ లు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, వార్డుసభ్యులు, అన్ని విభాగల నాయకులు పాల్గొన్నారు.
Admin
E Nivas News