ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుడి పాత్ర అత్యంత పవిత్రమైనది. తరం తరం జ్ఞానాన్ని పంచుతూ, విలువలను నాటుతూ,దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే శిల్పి ఉపాధ్యాయుడు. అలాంటి ఉపాధ్యాయుడి ఆత్మగౌరవాన్ని, స్వేచ్ఛను, వృత్తి గౌరవాన్ని క్రమంగా తాకట్టు పెడుతున్నాయి నేటి ప్రభుత్వ వ్యవస్థలు అనే వేదనాత్మక వాస్తవం మన ముందుంది. ఒకప్పుడు "గురువు బ్రహ్మ,గురువు విష్ణు" అని శిరసు వంచిన సమాజం, నేడు ఉపాధ్యాయుడిని కేవలం ఆదేశాలు అమలు చేసే ప్రభుత్వ ఉద్యోగిగా మాత్రమే చూస్తోంది. విద్యాబోధనే ప్రధాన కర్తవ్యంగా ఉండాల్సిన ఉపాధ్యాయుడిని, ఎన్నికల విధులు, జనగణన, పథకాల సర్వేలు, బ్యాంకు లింకేజీలు, ఆన్‌లైన్ డేటా ఎంట్రీలు వంటి అనేక అనవసర బాధ్యతలతో కుంగదీస్తున్నారు. దీని వల్ల బోధనపై దృష్టి తగ్గడమే కాకుండా ఉపాధ్యాయుడి వృత్తి గౌరవం తీవ్రంగా దెబ్బతింటోంది. ప్రభుత్వాలు ప్రవేశపెట్టే విధానాలు చాలాసార్లు ఉపాధ్యాయుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా రూపుదిద్దుకుంటున్నాయి. బదిలీలు, పదోన్నతులు, జీతభత్యాలు వంటి కీలక అంశాల్లో పారదర్శకత లేకపోవడం, రాజకీయ జోక్యం పెరగడం వల్ల ఉపాధ్యాయుల్లో అసంతృప్తి, నిరాశ పెరుగుతోంది. ప్రశ్నిస్తే శిక్షలు, మాట్లాడితే నోటీసులు అన్న పరిస్థితి ఉపాధ్యాయుడిని మౌనంగా మారుస్తోంది. ఇంకా బాధాకరమైన విషయం ఏమిటంటే ప్రభుత్వ పాఠశాలల పరిస్థితుల పట్ల ఉన్న నిర్లక్ష్యం. మౌలిక వసతుల లేమి, తరగతి గదుల కొరత, బోధనా సామగ్రి లేకపోవడం వంటి సమస్యలను భరించాల్సింది ఉపాధ్యాయుడే. అయినా విద్యా ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోతే నింద మాత్రం ఉపాధ్యాయుడిపైనే వేయడం జరుగుతోంది. ఇది అతని ఆత్మగౌరవాన్ని గాయపరుస్తున్న దుర్మార్గమైన ధోరణి. ఉపాధ్యాయ సంఘాల ఉద్యమాలను కూడా ప్రభుత్వాలు అనుమానాస్పదంగా చూస్తూ, అణచివేయడానికి ప్రయత్నిస్తున్నాయి. శాంతియుత నిరసనలకు కూడా అనుమతి లేకుండా చేయడం, వృత్తి హక్కులను కాలరాస్తోంది. ఉపాధ్యాయుడు ఉద్యోగి మాత్రమే కాదు, ఆలోచన గల మేధావి, సమాజ మార్గదర్శి అనే సత్యాన్ని పాలక వ్యవస్థలు మరచిపోతున్నాయి. ఈ పరిస్థితి మారాలంటే ప్రభుత్వాలు ఉపాధ్యాయుడిని నమ్మాలి,గౌరవించాలి. విద్యా విధానాల రూపకల్పనలో ఉపాధ్యాయుల భాగస్వామ్యం ఉండాలి. బోధనేతర పనుల నుంచి ఉపాధ్యాయుడిని విముక్తం చేయాలి.వృత్తి భద్రత,గౌరవప్రదమైన జీతాలు, స్వేచ్ఛాయుతమైన వాతావరణం కల్పించాలి. ఉపాధ్యాయుడి ఆత్మగౌరవాన్ని కాపాడినప్పుడే విద్యా వ్యవస్థ బలపడుతుంది. ఉపాధ్యాయుడిని తక్కువ చేసి చూసే వ్యవస్థలు చివరకు సమాజాన్నే అజ్ఞానంలోకి నెట్టే ప్రమాదం ఉంది. కాబట్టి "ఉపాధ్యాయుడు గౌరవించబడితేనే విద్య వెలుగుతుంది" అనే సత్యాన్ని ప్రభుత్వం గుర్తించి, ఆచరణలో పెట్టాల్సిన అవసరం అత్యవసరం. *ఉపాధ్యాయుడు సమాజ నిర్మాత* ఉపాధ్యాయుడు సమాజానికి మేధో మూలధనం. విద్య అనే దీపాన్ని తరతరాలకు అందించే దీపశిఖ. అలాంటి ఉపాధ్యాయుడి ఆత్మగౌరవాన్ని,వృత్తి స్వేచ్ఛను,మానసిక స్థైర్యాన్ని నేటి ప్రభుత్వ వ్యవస్థలు పద్ధతిగా తాకట్టు పెడుతున్నాయనే ఆరోపణలు దేశవ్యాప్తంగా వినిపిస్తున్నాయి. ఈ వాస్తవాన్ని అర్థం చేసుకోవాలంటే కొన్ని స్పష్టమైన ఉదాహరణలను పరిశీలించాల్సి ఉంటుంది.
*బోధనేతర పనులతో ఉపాధ్యాయుడి గౌరవ హరణo* ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు తరగతి గదుల్లో పాఠాలు చెప్పాల్సిన సమయంలో ఎన్నికల విధులు, జనగణన, రేషన్ కార్డుల సర్వే, ఆధార్, బ్యాంక్ లింకేజీ, పథకాల డేటా ఎంట్రీ వంటి పనులకు నియమించబడుతున్నారు. ఒక గ్రామీణ పాఠశాల ఉపాధ్యాయుడు నెలల తరబడి ఎన్నికల రివిజన్ పనుల్లో ఉండటం వల్ల విద్యార్థులకు పాఠాలు చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా విద్యా ప్రమాణాలు పడిపోయినా, నింద మాత్రం ఆ ఉపాధ్యాయుడిపైనే పడింది. ఇది అతని వృత్తి గౌరవాన్ని తీవ్రంగా దెబ్బతీసిన సంఘటన. *ఆదేశాల వ్యవస్థలో ఉపాధ్యాయుడు* ప్రభుత్వ విద్యాశాఖ తరచూ ఆన్‌లైన్ యాప్‌లు, పోర్టల్స్ ద్వారా రోజువారీ నివేదికలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేస్తోంది. ఒక ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు పాఠం చెప్పే సమయంలోనే "ఫోటో అప్‌లోడ్ చేయాలి,రిపోర్ట్ పంపాలి" అనే ఒత్తిడికి లోనయ్యాడు. విద్యార్థుల కన్నా మొబైల్ ఫోన్ ముఖ్యం అయినట్టు పరిస్థితి మారింది. ఇది ఉపాధ్యాయుడిని ఒక బోధకుడిగా కాకుండా, డేటా ఎంట్రీ క్లర్క్‌గా మార్చేసింది. *బదిలీలు....పదోన్నతుల్లో అన్యాయం* ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు మెరిట్ ఆధారంగా కాకుండా రాజకీయ ఒత్తిళ్లతో జరుగుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. పదేళ్లుగా మారుమూల ప్రాంతంలో పనిచేసిన ఉపాధ్యాయుడికి బదిలీ రావాల్సిన సమయానికి, సంబంధాలు ఉన్న మరో వ్యక్తి పట్టణ ప్రాంతానికి బదిలీ పొందాడు. నిజాయితీగా పనిచేసిన ఉపాధ్యాయుడు నిరాశకు గురై, తన విలువను ప్రశ్నించుకోవాల్సి వచ్చింది. *మౌలిక వసతుల లోపం.. నింద మాత్రం ఉపాధ్యాయుడిపైనే..* చాలా ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీరు,మరుగుదొడ్లు, సరైన తరగతి గదులు లేవు. వర్షాకాలంలో చినుకులు పడే తరగతి గదిలో పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు, విద్యార్థుల హాజరు తగ్గిందని అధికారులు ప్రశ్నించారు. వసతులు ఇవ్వని ప్రభుత్వం, ఫలితాలు మాత్రం ఆశించడం ఉపాధ్యాయుడి ఆత్మగౌరవానికి అవమానం.
*ప్రశ్నిస్తే శిక్షలా......!* విద్యా విధానాల్లో లోపాలను ప్రశ్నించిన ఉపాధ్యాయ సంఘ నాయకులపై నోటీసులు,సస్పెన్షన్లు విధించిన సందర్భాలు ఉన్నాయి. ఒక ఉపాధ్యాయుడు సోషల్ మీడియా వేదికగా పాఠశాల సమస్యలను ప్రస్తావించడంతో,అతనిపై క్రమశిక్షణ చర్యలు ప్రారంభించబడ్డాయి. ఇది ఉపాధ్యాయుల స్వేచ్ఛా భావ వ్యక్తీకరణను అణిచివేసిన ధోరణి కనిపిస్తుంది. *తక్కువ జీతాలు – అధిక అంచనాలు* సమాజాన్ని తీర్చిదిద్దే బాధ్యత ఉన్న ఉపాధ్యాయుడికి జీవన వ్యయాలకు సరిపడని జీతాలు చెల్లిస్తూ, అత్యుత్తమ ఫలితాలు ఆశిస్తున్నారు. ఉదాహరణకు, కాంట్రాక్ట్ లేదా ఔట్‌సోర్సింగ్ విధానంలో పనిచేసే ఉపాధ్యాయుడు సంవత్సరాల పాటు స్థిరత్వం లేకుండా పనిచేస్తూ, 'ఫలితాలు తక్కువ' అని తొలగింపునకు గురయ్యాడు. ఇది మానవీయత లేని వ్యవస్థను ప్రతిబింబిస్తుంది. ఈ ఉదాహరణలన్నీ ఒకటే చెబుతున్నాయి.ప్రభుత్వ వ్యవస్థలు ఉపాధ్యాయుడిని గౌరవించకుండా, అతని ఆత్మగౌరవాన్ని పణంగా పెడుతున్నాయి. ఉపాధ్యాయుడిని నమ్మి, గౌరవించి, అవసరమైన స్వేచ్ఛనిచ్చినప్పుడే విద్యా వ్యవస్థ బలపడుతుంది. ఉపాధ్యాయుడి ఆత్మగౌరవం కాపాడబడితేనే సమాజ భవిష్యత్తు సురక్షితంగా ఉంటుంది. --డా.ఓర్సు రాయలింగు 9849446027
Admin
E Nivas News