ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : జన విజ్ఞాన వేదిక- తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చెకుముకి జిల్లా స్థాయి సైన్స్ టాలెంట్ టెస్ట్ లో మంథని బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థుల బృందం విక్రాంత్, మణిచరణ్, సుశ్రుతలు ప్రతిభ కనబరిచి మొదటి స్థానంలో నిలిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. శుక్రవారం పెద్దపల్లి బాలికల ఉన్నత పాఠశాల వేదికగా జరిగిన జిల్లా స్థాయి చెకుముకి సైన్స్ సంబరాలలో భాగంగా జరిగిన టాలెంట్ టెస్టులో పెద్దపల్లి జిల్లాలోని అన్ని మండలాల నుంచి మండల స్థాయి విజేతలు ఈ పోటీలలో పాల్గొన్నారు. ఈ పోటీల్లో ఇంగ్లీష్ మీడియం విభాగంలో మంథని బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ చూపి మొదటి స్థానంలో నిలిచారు. గెలుపొందిన విద్యార్థులు డిసెంబర్ 12 ,13 ,14 తేదీలలో కరీంనగర్ వేదికగా జరిగే రాష్ట్రస్థాయి చెకుముకి సైన్సు సంబరాలు- టాలెంట్ టెస్టులో పాల్గొననున్నారు. అద్భుత ప్రతిభ చూపి మంథని బాలికల ఉన్నత పాఠశాల ఖ్యాతిని మరింత ఇనుమడింపజేసిన విద్యార్థి బృందానికి, గైడ్ టీచర్ శంకరయ్య, శ్రీకాంత్ , పద్మలకు ప్రధానోపాధ్యాయులు సుమలత, పాఠశాల ఉపాధ్యాయ బృందం, తోటి విద్యార్థులు అభినందనలు తెలిపారు.
Admin
E Nivas News