Thursday, 30 July 2026 01:17:15 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

భారత మహిళల భాగ్యవిధాత-అంబేద్కర్

Date : 19 April 2026 11:40 PM Views : 336

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : శాస్త్ర సాంకేతిక రంగంలో ఎన్నో ఘనతలు సాధిస్తున్న క్రమంలోనే దాదాపు ప్రపంచంలో అన్ని దేశాల్లో మహిళల పట్ల వివక్ష ఈనాటికీ కొనసాగుతూనే ఉంది. ప్రజాస్వామ్య దేశాలుగా గుర్తింపు పొందిన దేశాల్లో సైతం మహిళల దగ్గరికి వచ్చేసరికి అప్రజాస్వామ్యంగానే వ్యవహరిస్తోంది సమాజం.వందకు వంద శాతంగా స్త్రీలు పురుషులతో సమానంగా నిలబడగల స్వేచ్ఛకు ఈ ప్రపంచం ఇంకా దూరంగానే ఉంది.ఈ విషయంలో భారతదేశం పరిస్థితి కూడా ఏమంత మెరుగ్గా లేదు. భారత సమాజంలో మొదటినుంచీ స్త్రీవ్యతిరేక దృక్పథం ఆధిపత్యం వహిస్తోంది. మహిళలను మగవారితో సమానంగా కాకుండా రెండవ తరగతి మనుషులుగా చూసే పరిస్థితి ఆనాడే కాదు ఈనాటికీ కనిపిస్తుంది. స్త్రీని క్రమంగా వంటింటికే పరిమితం చేయటం వెనుక మగవారి కుట్ర ఉంది. అటు స్త్రీలను ఇటు కింది కులాల వారిని కలిపి అణిచి వేసే కుట్రలు ఏకకాలంలో పురుడుపోసుకున్నాయి. వారికి స్త్రీ బానిసత్వాన్ని ధర్మ బద్ధం చేయటానికి రకరకాల కథలు అల్లవలసి వచ్చింది. ఆమెకు నిజజీవితంలో లేని ప్రాధాన్యతను ఆపాదిస్తూ అల్లిన కట్టుకథలు ఆమె చుట్టు కనపడని ఉచ్చును బిగించాయి. ఆమె ఆ కట్టుకథల మాయలోపడి తన బానిసత్వాన్ని వరంగా భావించింది. తన కోసం కనీసం ఆలోచించుకోలేని స్థాయికి మహిళ వెళ్ళటం వెనుక పురుషస్వామ్య వ్యవస్థ ఏనాడో సిద్ధం చేసిపెట్టిన అబద్ధాలతో అల్లిన వల దాగి ఉంది. మనదేశంలో ఆ కుట్రలను స్పష్టంగా పసిగట్టినవాడు అంబేద్కర్.ఆయన శూద్రులను, అతిశూద్రులను, మహిళలను ఒక వర్గం తన ప్రయోజనాల కోసం ఎట్లా వంచించిందో ఉదాహరణ పూర్వకంగా వివరించాడు. అంతకుముందు మహాత్మా జ్యోతిరావు ఫూలే ఈ కుట్ర గురించి భారత సమాజానికి తొలిసారిగా తెలియజేశాడు. దాని మీద పరిశోధించి శాస్త్రీయమైన సిద్ధాంతంతో ముందుకు వచ్చినవాడు అంబేద్కర్. తరతరాలుగా ఎవరైతే ఈ సమాజం దాష్టీకానికి బలైపోయారో వాళ్లకోసం చిత్తశుద్ధితో పోరాటాలు చేశాడు. అందుకే దళితులతో బాటు మహిళా హక్కుల కోసం విస్తృతంగా పోరాటాలు చేశాడు."ఒకదేశంలోని మహిళలు సాధించిన అభివృద్ధి దేశాభివృద్ధికి కొలమానం"గా భావించాడు అంబేద్కర్. మహిళాలోకం అభివృద్ధి పట్ల అంబేడ్కర్ గారికి ఉన్న స్పష్టత, చిత్తశుద్ధి భారత దేశం తొలితరం నాయకులలో మరెవ్వరికీ లేదు. జనాభాలో సగభాగమున్న మహిళలు రకరకాల ఆంక్షల నడుమ దీనంగా ఎలా బతుకీడుస్తున్నారో గమనించాడు అంబేద్కర్. ఈ దేశంలో ఎక్కడ ఎలాంటి అసమానత కనిపించినా అంబేద్కర్ దాని గురించి ఆలోచించాడు. దాని మూలాలు ఏమిటో శోధించాడు. దాని నివారణకు ప్రభుత్వం కానీ సమాజం కానీ ఎలా ముందుకు వెళ్ళాలో దానికి కావాల్సిన చట్టాలు ఎలా ఉండాలో చెప్పాడు.చాలా శ్రమకోర్చి ఆ చట్టాలను కూడా స్వయంగా రూపొందించాడు. అలా రూపొందించినదే 'హిందుకోడ్ బిల్లు'.1947,ఏప్రిల్ 11 నాడు ఆనాటి రాజ్యాంగ పరిషత్తు ముందుకు హిందూ కోడ్ ముసాయిదా బిల్లును తెచ్చాడు అంబేద్కర్. ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ మహిళలకు ఈ దేశంలో పురుషులతో సమానమైన ప్రాధాన్యత లేదు.పురుషులకు గల అన్నిరకాల హక్కులు స్త్రీలకు లేవు. ఈ అసమానతను రూపుమాపాలనే ఉద్దేశ్యంతో అంబేద్కర్ తయారుచేసినదే హిందుకోడ్ బిల్లు. చాలా గొప్ప ఆశయంతో అంబేద్కర్ తయారు చేసిన ఈ బిల్లును నెహ్రూ, అతని పరివారంలోని కొంతమంది తప్ప అప్పటి నాయకగణమంతా వ్యతిరేకించింది. మహిళాహక్కుల పట్ల ఆనాటి నాయకులకు గల వ్యతిరేకతను ఈ సంఘటన అద్దంలో చూపుతుంది. అయినా బిల్లు పాస్ కావటానికి అంబేద్కర్ చాలా ప్రయత్నాలు చేశాడు. చివరగా అప్పటి రాష్ట్రపతి బాబు రాజేంద్రప్రసాద్ ఈ బిల్లును వెనుకకు పంపటంతో గత్యంతరం లేక దాన్ని ఉపసంహరించుకున్నాడు అంబేద్కర్. ఈ నేపథ్యంలోనే సుదీర్ఘంగా పోరాటం చేసినప్పటికీ లాభం లేకపోవటంతో తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ 1951, సెప్టెంబరు 27 న న్యాయ శాఖామంత్రిగా తన పదవికి రాజీనామా చేశాడు. మహిళాహక్కుల సాధన కోసం తన పదవిని వదులుకున్న త్యాగశీలి అంబేద్కర్. ఈ ప్రపంచంలోనే మహిళా హక్కుల కోసం ఇంత తీవ్రంగా పోరాటం చేసిన పురుష నాయకులు లేరు. అయతే తదనంతర కాలంలో హిందుకోడ్ బిల్లు నాలుగు బిల్లులుగా విడిపోయి ఆనాటి ప్రధాని జవాహర్లాల్ నెహ్రూ ఆధ్వర్యంలో ఆమోదం పొందింది. అంబేద్కర్ పాత బిల్లులో పేర్కొన్న అన్ని రకాల అంశాలు కొత్త బిల్లులలో లేకపోవడం కొంత నిరాశను కల్గించే అంశం. అయితే ఒకరకంగా ఆయన పడిన తపనకు నెహ్రూ కొంతవరకు న్యాయం చేయగలిగాడు. అంబేద్కర్ అశేష భారత మహిళా లోకానికి హిందుకోడ్ బిల్లుతో ఆరాధ్యునిగా మారిపోయాడు. రాజ్యాంగంలో కూడా మహిళలకోసం ఎన్నో ఆర్టికల్స్ పొందుపరిచాడు. ఆర్టికల్ 15 (3), 39 (ఎ), 39 (డి), 51(ఎ), (ఈ) మొదలైనవి మహిళల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని అంబేద్కర్ రాజ్యాంగంలో ప్రవేశపెట్టిన కొన్ని ఆర్టికల్స్. వీటిలో అడుగడుగునా మహిళల సాధికారతను నిలబెట్టే ఆయన ఆశయం కనిపిస్తుంది. అంబేద్కర్ అనంతరం మహిళల పైన అణిచివేతను నిరోధిస్తూ చేయబడిన అనేక చట్టాలు ఆయన అందించిన స్ఫూర్తితో వెలువడినవే.ఈ దేశంలో వందల ఏళ్లుగా స్త్రీల జీవితంలో రాని మార్పు ఒక్క అంబేద్కర్ కృషి మూలంగా గత శతాబ్ధిలో మొదలయ్యింది. ఈ శతాబ్ధిలో కూడా కొనసాగుతున్నది. ఆయన ఆశయాన్ని సంపూర్ణంగా నెరవేర్చటానికి ఈ కాలానికి అనుగుణంగా ఇంకా కొత్త చట్టాలను రూపొందించవలసిన అవసరం కుడా ఉంది. ఈ దేశంలో మహిళల దుస్థితికి కారణం మనువే అన్నాడు. స్త్రీలను తొక్కి ఉంచడానికి మనువు వారి తలరాతను రాస్తే దాన్ని తుడిచి వారికి అన్నిరకాలుగా విమక్తిని ప్రసాదించిన భాగ్యవిధాత అంబేద్కర్. -తోకల రాజేశం 9676761415

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :