ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ నితికా పంత్, బుధవారం లింగాపూర్, సిర్పూర్ (యు) పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేసి స్టేషన్ పనితీరు, రికార్డుల నిర్వహణపై అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్టేషన్ రికార్డులు, ఎఫ్‌ఐఆర్‌లు, కేసు డైరీలు, పెండింగ్ కేసులు,ఆయుధాగారం, లాక్‌అప్, పరిశుభ్రత, సీసీ కెమెరాల పనితీరు, సిబ్బంది హాజరునుపరిశీలించారు. పెండింగ్‌లో ఉన్న కేసుల దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేసి చట్టపరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జనరల్ డైరీ (జీడీ)ను ప్రతిరోజూ క్రమం తప్పకుండా నమోదు చేయడంతో పాటు, బయటి విధులకు వెళ్లే ప్రతి పోలీసు సిబ్బందికి డ్యూటీ పాస్ జారీ చేసి వారి రాకపోకల వివరాలను నమోదు చేయాలని సూచించారు. అన్ని కేసులను సకాలంలో సీసీటీఎన్‌ఎస్ పోర్టల్‌లో నమోదు చేసి ఎలాంటి ఎంట్రీలు పెండింగ్‌లో లేకుండా చూడాలని ఆదేశించారు.ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ 24 గంటల పెట్రోలింగ్ నిర్వహించాలని, సైబర్ నేరాలు, అనుమానాస్పద వ్యక్తులు, రాత్రి వేళల్లో నిఘాను మరింత పెంచాలని సూచించారు. ప్రతి రోజు రోల్ కాల్ నిర్వహించి విధుల కేటాయింపు, చట్టాలపై అవగాహన, క్రమశిక్షణ, ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించే అంశాలపై సిబ్బందికి సూచనలు ఇవ్వాలని తెలిపారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదుపై వెంటనే స్పందించి పారదర్శకంగా దర్యాప్తునిర్వహించాలని, మహిళలు, చిన్నారులపై నేరాలు, సైబర్ నేరాలు, గుట్కా, గుడుంబా, జూదం, మట్కా, ఆన్‌లైన్ బెట్టింగ్ తదితర అక్రమ కార్యకలాపాలపై నిరంతర నిఘా ఉంచి చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బీట్ పోలీసింగ్‌ను మరింత సమర్థవంతంగా అమలు చేస్తూ కమ్యూనిటీపోలీసింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని, గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజల సహకారాన్ని పొందాలని సూచించారు. అలాగే స్టేషన్ పరిశుభ్రత, రికార్డుల నిర్వహణలో నాణ్యత పాటిస్తూ ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది క్రమశిక్షణతో విధులు నిర్వహించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఎస్పీ నితికా పంత్ సూచించారు. ఈ తనిఖీలో ఆసిఫాబాద్ డీఎస్పీ అశోక్, జైనూర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రమేష్,సబ్‌ఇన్‌స్పెక్టర్లు సురేష్,కొమురయ్యతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Admin
E Nivas News