ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : కానుక ప్రతినిధి పాములపాడు/ఆత్మకూరు సెప్టెంబర్-15):- వినాయక నిమజ్జనం కార్యక్రమాలు ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నిర్వహించేందుకు పోలీస్ శాఖ ముందస్తు చర్యలు చేపడుతోందనీ నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షోరాన్ అన్నారు. ఈ నేపథ్యంలో నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఐపీఎస్ నేడు ఆత్మకూరు సబ్ డివిజన్ పరిధిలోని, వెలుగోడు, ఆత్మకూరు, పాములపాడు, జూపాడుబంగ్లా, మొదలగు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న వినాయక నిమజ్జన ఘాట్‌లను, మరియు ఊరేగింపు జరిగే ప్రధాన ప్రాంతాలను స్వయంగా ఎస్పీ గారు సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ సునీల్ షోరాన్ నిమజ్జన ఘాట్‌ల వద్ద ఏర్పాటు చేసిన భద్రతా చర్యలు, ప్రజల రాకపోకలు, వాహనాల నియంత్రణ, పోలీస్ బందోబస్తు తదితర అంశాలపై సంబంధిత అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. వినాయక నిమజ్జనం సందర్భంగా భక్తులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు చేపట్టాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎస్పీ సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించారు. నిమజ్జన కార్యక్రమాలు సజావుగా జరిగేలా ఘాట్‌ల వద్ద నిరంతరం పోలీస్ సిబ్బంది అందుబాటులో ఉండాలని, రద్దీని క్రమబద్ధీకరించడంతో పాటు ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అలాగే నిమజ్జన కార్యక్రమాల్లో పాల్గొనే, ప్రజలు పోలీసులకు సహకరించి, పోలీస్ శాఖ సూచించిన భద్రతా నిబంధనలను పాటించాలని జిల్లా ఎస్పీ కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గారితో పాటు ఆత్మకూరు డిఎస్పి రామంజి నాయక్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ అశోక్, ఆత్మకూరు అర్బన్ సీఐ మహేశ్వర్ రెడ్డి, రూలర్ సీఐ ఎం.సురేష్ కుమార్ రెడ్డి, పాములపాడు ఎస్ఐ పి.తిరుపాలు, సంబంధిత పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
Admin
E Nivas News