ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల : గ్రామీణ, పట్టణ, స్థానిక సంస్థల ఎన్నికలను స్వేచ్ఛాయుతంగా, నిష్పాక్షికంగా నిర్వహించేందుకు అధికారులు ముందస్తు ప్రణాళికతో, సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ) అనిల్ చంద్ర పునేఠా సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ముందస్తు చర్యలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ జి.రాజ కుమారి గణియా, డీపీఓ, జెడ్పీ సీఈఓ, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మాట్లాడుతూ... పోలింగ్ కేంద్రాల పరిస్థితి, మౌలిక వసతులు, సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి నిబంధనలకు అనుగుణంగా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి గణియా మాట్లాడుతూ... జెడ్పీటీసీ, ఎంపీటీసీ, పంచాయతీరాజ్, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితాల తయారీ, బ్యాలెట్ బాక్సుల సమీకరణ, పోలింగ్ కేంద్రాల గుర్తింపు ప్రక్రియలు వేగంగా జరుగుతున్నాయని వివరిస్తూ, ఎస్సీ, ఎస్టీ, బీసీ మ్యాపింగ్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేస్తున్నామని తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణకు జిల్లా ఎస్పీతో సమన్వయం చేసుకుంటున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News