ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు మండలంలోని, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో మంగళవారము జిల్లా అంధత్వ నివారణ సంఘం ఆధ్వర్యంలో కంటి వైద్య నిపుణులు పి.షేక్షావలి విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. ఆయన పాఠశాలలోని, 275 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించగా, 43 మంది విద్యార్థులకు దృష్టిలోపం ఉన్నట్లు గుర్తించిన, వారికి ఉచిత కళ్లఆద్దాలను కూడా పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా కంటి వైద్యులు పి.షేక్షావలి మాట్లాడుతూ ఆరోగ్యంపై పలు సూచనలు చేశారు. స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, ఇతర డిజిటల్ పరికరాలను ఎక్కువసేపు చూడకుండా పరిమితంగా వినియోగించాలని, మొబైల్ ఫోన్‌ను కళ్లకు దగ్గరగా పెట్టుకుని చూడకూడదని సూచించారు. చదువుకునే సమయంలో సరైన వెలుతురు ఉండేలా చూసుకోవడంతో పాటు, కళ్లకు తగిన విశ్రాంతి ఇవ్వాలని తెలిపారు.
కంటి ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు లభించే ఆకుకూరలు, పండ్లు, గుడ్లు, పాలు, వంటి పోషకాహారాన్ని తీసుకోవాలని సూచించారు. కళ్లలో ఇబ్బందులు, చూపు మందగించడం వంటి సమస్యలు కనిపిస్తే వెంటనే కంటి వైద్యులను సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ ఎం.రాజ్యలక్ష్మి, హెల్త్ సూపర్‌వైజర్ పద్మావతి, ఆరోగ్య కార్యకర్త మాధవి, ఆశా కార్యకర్త దేవమణి, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Admin
E Nivas News