ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : చనిపోయిన తర్వాత ప్రతి ఒక్కరూ తమ కళ్ళను దానం చేయండి-గ్రుడ్డివారికి వెలుగులు ఇవ్వండి అని కంటి వైద్య నిపుణులు పి.షేక్షావలి పిలుపునిచ్చారు. జాతీయ నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా ఆత్మకూరులోని, ఆదిత్య జూనియర్ కళాశాలలో మంగళవారం నేత్రదాన అవగాహన వైద్య శిబిరాన్ని కంటి వైద్యులు పి.షేక్షావలి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు నేత్రదానం ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. ఆగస్టు-25 నుంచి సెప్టెంబర్-8 వరకు జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో నేత్రదానం ద్వారా మరణానంతరం ఇద్దరు అంధులకు చూపు కల్పించే అవకాశం ఉందని వైద్యులు వివరించారు. మరణించిన వ్యక్తి నుంచి వీలైనంత త్వరగా, సాధారణంగా ఆరు గంటల్లోపు కార్నియాను సేకరించడం ద్వారా చూపులేని వారికి వెలుగును అందించవచ్చని తెలిపారు. నేత్రదానం చేయడం వల్ల దాత కుటుంబ సభ్యులకు ఎలాంటి ఆర్థిక భారం ఉండదని, నేత్రాలను సేకరించే ప్రక్రియ తక్కువ సమయంలోనే పూర్తవుతుందని చెప్పారు. వయస్సుతో సంబంధం లేకుండా అనేక సందర్భాల్లో నేత్రదానం చేయవచ్చని, ప్రజలు అపోహలను వీడి నేత్రదానానికి ముందుకు రావాలని వైద్యులు సూచించారు. కంటి చూపు కోల్పోయిన వారికి వెలుగును అందించడం ద్వారా మరణానంతరం కూడా మరొకరి జీవితంలో వెలుగులు నింపవచ్చని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ నేత్రదానంపై అవగాహన పెంచుకుని, తమ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులకు కూడా నేత్రదాన ప్రాధాన్యతను తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ విజయ భాస్కర్ నాయుడు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News