ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు హక్కుగా సంక్రమించి ఇప్పటికే మంజూరుకాబడిన వివిధ రకాల ఆర్థిక ప్రయోజనాలు దాదాపు 35 వేల కోట్లకు చేరిన సంగతి తెలిసిందే. ఇంకనూ, మంజూరు కావలసిన వేతన సవరణ, 4 విడతల డి.ఎ., సరెండర్ లీవ్లు తదితర ప్రయోజనాలు, వాటి అంచనా మరికొన్ని వేలకోట్లు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఇన్ని వేల కోట్ల రూపాయల చెల్లింపు ప్రభుత్వానికి అసాధ్యంగా మారిన నేపధ్యంలో ప్రత్యామ్నాయ పరిష్కార మార్గంగా మన సంఘం "బాకీకి భూమి" అనే ప్రతిపాదనను అటు ప్రభుత్వానికి నివేదించి, ఇటు "రండి- టీ తాగుతూ మాట్లాడుకుందాం" అనే కార్యక్రమం ద్వారా ఉద్యోగుల దగ్గరకు తీసుకువెళ్ళిన విషయం మీ అందరికీ తెలిసిందే. ప్రభుత్వం నుండి ఎటువంటి నిర్దిష్టమైన స్పందన అధికారికంగా లేనందువ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లలో పేరుకుపోయిన బకాయిల చెల్లింపు విషయంలో తీవ్ర ఆవేదన నెలకొనియున్నది. మరోప్రక్క వందిమాగదులుగా తయారయిన భజన సంఘాలు ప్రభుత్వంతో చర్చించేసాం.... వేల కోట్ల బకాయిల చెల్లింపులు అయిపోయాయి.... వరాల జల్లులు కురిసిపోయాయి..., అంటూ యథావిధిగా తమ భజన కొనసాగిస్తున్నారు. ఈ పరిస్థితిలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లుకు తీవ్ర గందరగోళం, అయోమయం నెలకొని ఉన్నది. ఈ శతభిషలకు తావు లేకుండా ఎప్పటిలాగే" భజనతో కాదు బాధ్యతతో పార్టీలతో కాదు ప్రభుత్వంతో " అన్న మన సంఘ మూలసూత్రాన్ని అనుసరించి యావత్తు ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల పక్షాన ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించదలిచాం. అందులో భాగంగా ప్రస్తుతం రాష్ట్ర బడ్జెట్ సమావేశాల తేదీలను రాష్ట్ర మంత్రి మండలి నిన్న ఖరారు చేసిన వేపధ్యంలో ఉద్యోగులకు ఇప్పటికే మంజూరు చేసి పెండింగ్లో ఉన్న బకాయిలు, అలాగే మంజూరు చేయవలసిన ఆర్ధిక ప్రయోజనాలు సిట్టింగ్ లేదా విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో పి.ఆర్.సి. కమీషన్ ఏర్పాటు, నాలుగు విడతల డి. ఎలు, మధ్యంతర భృతి మొదలగు అంశాలు 2026-2027 ఆర్థిక సంవత్సరానికి ఫిబ్రవరి 14వ తేదీన ప్రవేశపెట్టే బడ్జెట్లో నిర్దిష్టమైన కేటాయింపులు చూపాలి లేదా ప్రత్యామ్నాయ పరిష్కారంపై ప్రభుత్వం తమ విధాన ప్రకటనను బడ్జెట్ ద్వారా తెలియపరచాలి అని డిమాండ్ చేయదలిచాము. అలాగే, సి.పి.ఎస్. రద్దు చేసి - ఓ.పి.ఎస్. పునరుద్ధరించాలన్న ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యకు ప్రభుత్వం పరిష్కారం చూపాలి. తాము అధికారంలోకి వస్తే సి.పి.ఎస్. / జి.పి.ఎప్లను సమీక్షించి ఆమోదయోగ్యమైన పరిష్కారం ఒక సంవత్సర కాలంలో చూపుతామున్న అధికార పక్ష పార్టీల ఎన్నికల హామీని ప్రస్తుత శాసనసభ / శాసన మండలి వేదికగా 2026-2027 ఆర్థిక సంవత్సరానికి చేసే బడ్జెట్ ప్రతిపాదనలో ప్రభుత్వం స్పష్టం చేయాలని కూడా కోరాలని నిర్ణయించాం. ఈ పై అంశాలన్నీ బడ్జెట్తో ముడిపడి ఉన్నందున ఇప్పటికే మన సంఘం పక్షాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి గారికి మరియు ఆర్థిక శాఖామాత్యులకు లిఖితపూర్వకంగా విన్నవించడం జరిగింది. సమస్య తీవ్రత మరియు తక్షణ పరిష్కార అవసరాన్ని గుర్తించేలా రాష్ట్ర శాసన వ్యవస్థలలో ప్రాతినిధ్యం వహించే 175 శాసన సభ్యులను మరియు 58 శాసనమండలి సభ్యులను, సంఘ ప్రతినిధులు నేరుగా కలిసి ఫ్రై అంశాలను బడ్జెట్ సమావేశాలలో స్థానిక ప్రజా ప్రతినిధులుగా వారి వారి నియోజకవర్గాల పౌరసమాజంలో అంతర్భాగమైన ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల తరపున బలంగా ప్రస్తావించి, సామకూల నిర్ణయాలు వెలువడేలా దోహదపడమని అభ్యర్థించాలని నిర్ణయించడమైనది. రాష్ట్ర కార్యవర్గ నిర్ణయం మేరకు 14 నుండి రాష్ట్ర అసెంబ్లీ / శాసనమండలి సమావేశాలు ప్రారంభమవుతున్న సందర్భంగా శ్రీశైలం నియోజకవర్గం శాసన సభ్యులు బుడ్డా రాజశేఖర్ రెడ్డి ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం -జిల్లా శాఖ ప్రతినిధి వర్గం కల్లూరి పెద్ద మస్తానయ్య ఆధ్వర్యంలో కలిసి ఉద్యోగుల పేరుకుపోయిన బకాయిలు, ఇంకమా మంజూరు కావలసిన ఆర్ధిక ప్రయోజనాల గురించి అసెంబ్లీలో ప్రస్తావించమని, ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళమని వినతిపత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఉద్యోగులు ఎమ్మెల్యేతో ప్రస్తావిస్తూ అలాగే సిట్టింగ్ లేదా విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో ముగ్గురు సభ్యుల వేతన సవరణ కమీషన్ ఏర్పాటుతో పాటు, మధ్యంతర భృతి తదితర ఆర్ధికపరమైన అంశాలలో 2026-2027 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టే రాష్ట్ర బడ్జెట్లో తగిన కేటాయింపులు ప్రతిపాదించాలని, అలాగే సి.పి.ఎస్. రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలన్న ఉద్యోగుల దీర్ఘకాలిక డిమాండ్ను పరిష్కరించాలని ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలుగుదేశం, జనసేన రాజకీయపార్టీల ఉమ్మడి ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు సి.పి.ఎస్., జి.పి.ఎస్ విధానాలను పునః సమీక్షించి సంవత్సరంలోగా ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపిస్తామన్న తమ ఎన్నికల హామీ మేరకు ప్రస్తుత బడ్జెట్ సమావేశంలోనే ఈ అంశంపై ప్రభుత్వం తన విధాన నిర్ణయాన్ని ప్రకటించాలని... ఆ మేరకు రాష్ట్ర శాసనసభలో మా ప్రతినిధిగా బలంగా గళం వినిపించాలని, ప్రభుత్వం సానుకూలంగా స్పందించేలా చూడాలని అభ్యర్థించడం జరిగింది. శ్రీశైలం నియోజకవర్గం శాసన సభ్యులు బుడ్డా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ తప్పకుండా ముఖ్యమంత్రి దృష్టికి, అదేవిధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామని, శాసన సభలో ప్రస్తావిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నంద్యాల జిల్లా ప్రతినిధులు, తాలూకా అధ్యక్షులు కల్లూరి పెద్ద మస్తానయ్య, సహా అధ్యక్షులు శ్రీనివాసు లు, కోశాధికారి వెంకటరమణయ్య, ఉపాధ్యక్షులు పి.గుర్రప్ప, జాయింట్ సెక్రటరీ ఎం.రసూల్, సునీల్ ఇతర సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News