ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1998-99 బ్యాచ్ పూర్వ విద్యార్థులు తమ స్నేహితుల పిల్లలు పదో తరగతిలో మంచి మార్కులు సాధించిన సందర్భంగా ఘనంగా అభినందన సభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రిటైర్డ్ ఫిజికల్ డైరెక్టర్- శివలక్ష్మి రెడ్డి, శ్రీనివాసులు, మున్నా లు హాజరై విద్య యొక్క గొప్పతనం, చదువు ద్వారా జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశాల గురించి విద్యార్థులకు ప్రేరణాత్మకంగా తెలియజేశారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ తమ స్కూల్ బ్యాచ్ స్నేహితులు కలిసి విద్యార్థుల విజయాలను గుర్తించి అభినందించడం ఎంతో ఆదర్శప్రాయమని కొనియాడారు. సమాజంలో విద్యకు ప్రాధాన్యత పెంచే విధంగా ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరగాలని ఆకాంక్షించారు. అలాగే ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా పవన్ కుమార్ అనే విద్యార్థి గురించి ప్రస్తావించారు. అతను తల్లిదండ్రులు లేకున్నా ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ చదువులో మంచి మార్కులు సాధించి ప్రతిభ కనబర్చినందుకు అతనిని అందరూ అభినందించారు. అతని ఉన్నత చదువులకు అవసరమైన ఆర్థిక సహాయం అందించేందుకు ముఖ్య అతిథులు మరియు 1998-99 బ్యాచ్ పూర్వ విద్యార్థులు ముందుకు వచ్చి సహకరిస్తామని ప్రకటించారు. ఇంకా, ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థుల కుటుంబాలు సాధారణ మరియు మధ్యతరగతి ఆర్థిక పరిస్థితుల్లో ఉన్న కుటుంబాలకు చెందినవారని, చదువు విషయంలో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు వచ్చినా అండగా నిలబడేందుకు 1998-99 స్కూల్ బ్యాచ్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని పూర్వ విద్యార్థులు హామీ ఇచ్చారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం అవసరమైన సహాయం, ప్రోత్సాహం అందించేందుకు తమ వంతు బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాములపాడు జిల్లా పరిషత్ హైస్కూల్ 1998-99 బ్యాచ్ పూర్వ విద్యార్థులందరూ, వారి పిల్లలు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొనడం జరిగింది.
Admin
E Nivas News