ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఇటీవల జనన, మరణ నమోదుపై కేంద్రం కొత్త చట్టం తీసుకువచ్చారని ఆలస్యమైతే కఠిన నిబంధనలు ఉంటాయని ఆత్మకూరు తహసీల్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో MRO రత్న రాధిక పేర్కొన్నారు. ఈ సందర్భంగా జి.రత్న రాధిక మాట్లాడుతూ ఈ విషయం విలేకరులకు తెలియజేసి, ప్రజలకు మీడియా పరంగా అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. భారత పార్లమెంట్ ఇటీవల ఆమోదించిన జనన, మరణాల నమోదు సవరణ బిల్లు 2026 ప్రకారం జనన మరియు మరణ ధ్రువీకరణ పత్రాల జారీ నిబంధనలలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయన్నారు. నకిలీ సర్టిఫికెట్లను నిరోధించడం, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బి ఎన్ ఎస్ ఎస్- 2023) చట్టానికి అనుగుణంగా డేటాను సురక్షితంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఘటన జరిగిన (జననం లేదా మరణం) 21 రోజులలోపు సచివాలయం, పంచాయతీ లేదా మున్సిపాలిటీ పరిధిలో ఉచితంగా నమోదు చేసుకోవచ్చు అని తెలియజేశారు. 21 రోజుల నుండి 1 సంవత్సరం వరకు నిర్ణీత రుసుము (అపరాధ రుసుము) చెల్లించి స్థానిక అధికారుల వద్ద నమోదు చేసుకోవచ్చు అన్నారు. 1 సంవత్సరం నుండి 2 సంవత్సరాల వరకు నిర్ణీత రుసుము చెల్లించి, ఆర్డీఓ జిల్లా అధికారుల అనుమతితో నమోదు చేయవచ్చు అని తెలియజేశారు. 2 సంవత్సరాలు దాటితే కోర్టు ఆమోదం తప్పనిసరి అన్నారు. జననం లేదా మరణం సంభవించి 2 సంవత్సరాలు దాటిన తర్వాత నమోదు చేయాలంటే ఇకపై నేరుగా మీసేవ లేదా సచివాలయాల్లో కుదరదన్నారు. స్థానిక ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు నుంచి ఉత్తర్వులు (కోర్ట్ ఆర్డర్ ) పొందడం తప్పనిసరని అన్నారు. కోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత మాత్రమే సచివాలయం/మున్సిపాలిటీ ద్వారా డిజిటల్ సర్టిఫికెట్ జారీ చేస్తారని తెలియజేశారు. ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించాలని కొత్త రూల్స్ పాటించి జనన, మరణ సర్టిఫికెట్లు పొందాలని పేర్కొన్నారు.
Admin
E Nivas News