ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : కులవివక్ష లేని సమ సమాజం కోసం సామాజిక శంఖారావం అనే కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా దళితవాడల సర్వేల సందర్భంగా మండలంలోని, ఇస్కాల గ్రామంలో సర్వేలు నిర్వహించారు. దళితవాడల సర్వేల కార్యక్రమానికి రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఏ.రాజశేఖర్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు ఎస్.బాలయ్య, జిల్లా కౌలు రైతు సంఘం సహాయ కార్యదర్శి డి.స్వామన్న దళితపేటలో ఉండే స్మశానాలు అందులో వృత్తిని నిర్వహిస్తున్న కాటికాపరులను మరియు డ్రైనేజీ వ్యవస్థను అలాగే సిసి రోడ్లను పరిశీలించి, గ్రామస్తులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకోన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి కుల వ్యవస్థ భారత దేశంలో ఏడు దశాబ్దాలు దాటిన ఇంకా కుల వ్యవస్థ కొన సాగుతుందని, నేటికీ దళితులను జిల్లా వ్యాప్తంగా, అన్ని గ్రామాలలో రెండవ తరగతి పౌరులు గాని చూస్తున్నారని, చాలా గ్రామాల్లో ఇప్పటికి రెండు గ్లాసుల పద్ధతి కొనసాగుతూ ఉందని, దళితులకు ఆలయ ప్రవేశం లేదని, పబ్లిక్ బస్టాండ్ లలో ఉండే రచ్చకట్టలపై కూర్చోవడంలేదని, అగ్రకులాల వీధుల్లో తిరిగే పరిస్థితి లేదని గ్రామాలలో నేటికి దళితులపై కుల వివక్ష, అంటరానితనం కొనసాగుతున్నట్లు సర్వేల ద్వారా తమ దృష్టికి వస్తుందన్నారు. గ్రామాలలో ప్రధానంగా స్మశానంలో వృత్తి నిర్వహిస్తున్న కాటికాపర్ల పరిస్థితి చాలా దయనీయంగా దుర్మార్గంగా ఉందని, ఈ సమాజం అంటగట్టిన వృత్తిని ఎంతో బాధ్యత నిర్వహిస్తూ సమాజానికి సేవ చేస్తున్న కాటికాపరులను పాలకులు గాని, అధికారులు గానీ నేటికీ గుర్తించి ఆదుకునే ప్రయత్నం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దళితుల సమస్యల పరిష్కారం కోసం ఇచ్చిన జీవో 1235 ను అమలు చేయాలనీ, అలాగే జస్టిస్ పుల్లయ్య కమిషన్ సిఫారసులు అమలు చేయాలన్నారు. కులాంతర వివాహాల రక్షణ చట్టం తీసుకొని వచ్చి ఎస్సీ, ఎస్టీ, అత్యాచార కేసుల్లో పోలీసుల నిర్లక్ష్యం అలాగే కొమ్ముకాస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలన్నారు. నేటికీ దళితులు గ్రామాలలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. కాటికాపరులు వృత్తిని నిర్వహిస్తున్న స్మశానాలు చిన్నవిగా ఉంటూ వాటికి బాటలు సరిగా లేవని, పూడ్చడానికి స్థలం లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. తాత ముత్తాతల కాలం నుండి ఈ వృత్తినే నిర్వహిస్తున్న కాటికాపరులను ప్రభుత్వం నేటికీ గుర్తించకపోవడం చాలా దుర్మార్గమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు కాటికాపరులను వృత్తిదారులుగా గుర్తించి నాలుగో తరగతి ఉద్యోగస్తులుగా నియమించి ఆదుకోవాలని, స్మశానలో వృత్తి నిర్వహిస్తున్న కాటికాపరులకు ఆరోగ్య భీమాతో పాటు వృత్తి పరికరాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అగ్నిగుండం చుట్టూ ఆలయంలో తిరగనివ్వమని, దళితులపై షరతు విధించి, రెండిట్లో ఏదో ఒకటి కోరుకోవాలని అంటూ ఆదిపత్య అగ్రకులాలు వ్యవహరించడం చాలా దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాలలో ఇలాంటి దురాచారాలు దుర్మార్గాలు దళితుల మీద అధిపత్య వర్గాలు చూపిస్తున్న కులం అహంకార పద్ధతిని కలెక్టర్, ఎస్పీ, రెవెన్యూ అధికారులు దృష్టి సారించకపోవడం చాలా బాధాకరమన్నారు. ఇప్పటికైనా అన్ని గ్రామాలలో అంటరానితనం, కుల వివక్ష పాటించడం నేరమని అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించి, చట్టాలపై అవగాహన కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, గ్రామాలలో సర్వేల ద్వారా తమ దృష్టికి వచ్చిన సమస్యలన్నిటిని జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని వాటిని అధికారులు తక్షణమే పరిష్కరించాలని లేనిపక్షంలో ప్రభుత్వ కార్యాలయాల ముందుర పెద్దఎత్తున ఆందోళన నిరసనలు కార్యక్రమాలు చేపట్టి ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏసేపు, మౌలాలి, సంజీవ గ్రామస్తులు పాల్గొన్నారు.
Admin
E Nivas News