ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఆత్మకూరు మండలంలోని, నల్లకాలువ గ్రామంలో కళ్లు కూడా తెరవని ఆ పసికందుకి లోకమేంటో తెలియదు. అమ్మ ఒడిలోని వెచ్చదనాన్ని పూర్తిగా ఆస్వాదించక ముందే, ఆ చిన్నారి ప్రాణం ఊపిరి కోసం కొట్టుమిట్టాడింది. ఆత్మకూరు మండలంలోని, నల్లకాలువ గ్రామానికి చెందిన అమరం మనీషా అనే నిరుపేద మహిళకు పుట్టిన నవజాత శిశువు, తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో ఈ లోకంలోకి అడుగుపెట్టింది. పుట్టుకతోనే తక్కువ బరువు దానికి తోడు గుండె, ఊపిరితిత్తులు పూర్తిగా అభివృద్ధి చెందకపోవడంతో ఆ పసిగుడ్డు శ్వాస తీసుకోవడానికే నరకయాతన అనుభవించింది. నరసరావుపేటలోని, లైఫ్ లైన్ హాస్పిటల్ లో కన్నబిడ్డ ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుంది, మెరుగైన చికిత్స కోసం రెక్కాడితే గానీ డొక్కాడని ఆ పేద కుటుంబానికి ఏం చేయాలో పాలుపోలేదు. రూపాయి కూడబెట్టే స్తోమత లేక, కళ్లముందే బిడ్డ ప్రాణం విలవిలలాడుతుంటే ఆ తల్లి గుండె పగిలిపోయింది. ఆపద్బాంధవుడిగా నిలిచిన ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి:- ఆ కటిక చీకట్లో వారికి ఆశాకిరణంలా శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి అండగా నిలిచారు. తమ బిడ్డను బతికించాలంటూ ఆ కుటుంబం తల్లడిల్లుతూ ఆయన్ను ఆశ్రయించగా ఆ తల్లి కడుపు కోతను, పసికందు పరిస్థితిని చూసి చలించిపోయిన ఎమ్మెల్యే క్షణం కూడా ఆలస్యం చేయకుండా తక్షణమే ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా అత్యవసరంగా వైద్య సహాయం అందేలా చొరవ తీసుకున్నారు. అధికారులతో మాట్లాడి, యుద్ధప్రాతిపదికన ప్రక్రియను పూర్తి చేయించి, శిశువు వైద్య చికిత్స నిమిత్తం ఏకంగా రూ. 3,01,192/-ల ఆర్థిక సహాయాన్ని ఎల్ఓసి ద్వారా మంజూరు చేయించారు. *కృతజ్ఞతా భావంతో కన్నీటి పర్యంతమైన కుటుంబం ఈ ఆర్థిక సాయం అందడంతో ఆ పసికందుకు మెరుగైన వైద్యం అందుతోంది. డబ్బు లేక వైద్యం ఆగిపోతుందనే భయం నుండి ఆ తల్లిదండ్రులు బయటపడ్డారు. తమ బిడ్డకు పునర్జన్మ ప్రసాదించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, దేవుడిలా వచ్చి ఆదుకున్న ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి కి ఆ కుటుంబ సభ్యులు చేతులు జోడించి, కన్నీటితో కృతజ్ఞతలు తెలుపుకున్నారు.
Admin
E Nivas News