ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / ఎన్టీఆర్ జిల్లా : అక్షరాంధ్ర కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని నిరక్ష్యరాస్యులు అక్షరాస్యులుగా మారి.. బంగారు భవితకు బాటలు వేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా విజయవాడ అర్బన్ పరిధిలోని, రామలింగేశ్వరనగర్‌లో నిర్వహిస్తున్న అక్షరాంధ్ర కేంద్రాన్ని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ శుక్రవారం సాయంత్రం సందర్శించారు. అక్షర జ్ఞానాన్ని పొందుతున్న మహిళలతో మాట్లాడి, వారి అభ్యసన సామర్ధ్యాన్ని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమానికి హాజరైన మహిళలతో ముచ్చటించి, బోధనా పద్దతులను పరిశీలించారు. వాలంటీర్లు అందిస్తున్న శిక్షణపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ మాట్లాడుతూ ఎన్‌టీఆర్ జిల్లాలో వయోజనులైన దాదాపు 96 వేల మంది నిరక్షరాస్యులను గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా గుర్తించడం జరిగిందని, వీరందరినీ అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తున్నట్లు తెలిపారు. అక్షర జ్ఞానం ద్వారా వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సామాజికంగా పొందే లాభాలను కలెక్టర్ వివరించారు. చదువు అనేది కేవలం అక్షరాలకే పరిమితం కాకుండా, ఆత్మవిశ్వాసం పెంపొందించి, ఆర్థిక స్వావలంబనకు దోహదపడుతుందని కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు. ప్రస్తుతం మొబైల్ ఫోన్ ద్వారా ఎన్ని సౌకర్యాలు పొందుతున్నామో మరోవైపు అంతే ప్రమాదం పొంచి ఉందని సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అందుకే డిజిటల్ లిటరసీ కూడా పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ డాక్టర్ డి.చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమాచారం డీఐపీఆర్‌వో, ఐ అండ్ పీఆర్, ఎన్‌టీఆర్ జిల్లా వారి ద్వారా జారీ చేయడం జరిగింది.
Admin
E Nivas News