ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ గురువారం ఆత్మకూరు రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీవో) కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా జెసి కార్యాలయ ఆవరణతో పాటు పరిసర ప్రాంతాల పరిశుభ్రతను పరిశీలించారు. కార్యాలయ ప్రాంగణాన్ని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా, పరిశుభ్రమైన వాతావరణంతో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం ఆర్డీవో కార్యాలయంలో రెవెన్యూ పరిపాలన, రీ-సర్వే పెండింగ్ అంశాలు, ప్రజలకు అందిస్తున్న సేవల పురోగతిపై ఆత్మకూరు ఆర్డీవో, ఆత్మకూరు తహసీల్దార్, కొత్తపల్లి తహసీల్దార్, డీఐఓఎస్ ఆత్మకూరు తదితర రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ మాట్లాడుతూ ప్రజలకు సంబంధించిన ప్రతి దరఖాస్తును ప్రభుత్వం నిర్దేశించిన సేవా ప్రమాణాల (ఎస్ ఎల్ ఏ) గడువులోనే పరిష్కరించాలని సూచించారు. బియాండ్ ఎస్‌ఎల్‌ఏ (బియాండ్ ఎస్ ఎల్ ఏ) కేసులు ఏవీ ఉండకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. విధుల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం, జాప్యానికి తావివ్వకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. రీ-సర్వే పెండింగ్ అంశాలను ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ నిర్ణీత గడువులో పూర్తి చేయాలని, ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించే దిశగా, అధికారులు సమన్వయంతో పనిచేయాలని జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ సూచించారు. ఈ సమావేశంలో ఆత్మకూరు ఆర్డీవో వెంకటశివ, సంబంధిత రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు.
Admin
E Nivas News