ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : బాలికలకు నాణ్యమైన విద్యతో పాటు సురక్షితమైన వసతి, మెరుగైన సౌకర్యాలు అందించడమే ఎన్డీయే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి అన్నారు. విద్య ద్వారానే బాలికల భవిష్యత్తుకు బంగారు బాటలు పడతాయని ఆయన పేర్కొన్నారు. శనివారం ఆత్మకూరు పట్టణంలో రూ.1.60 కోట్లు, బండి ఆత్మకూరులో రూ.1.63 కోట్ల వ్యయంతో కస్తూరిబా బాలికల జూనియర్ కళాశాలల్లో నిర్మించిన నూతన వసతి గృహాలను ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థినులతో మాట్లాడి వసతి గృహంలో వారికి అందుతున్న సౌకర్యాలు, భోజన వసతి, తాగునీరు తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. ‘తల్లికి వందనం’ పథకం ద్వారా తల్లిదండ్రులకు ఆర్థికంగా చేయూత అందిస్తున్నామని, ‘సర్వేపల్లి రాధాకృష్ణ కిట్’ ద్వారా విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, స్కూల్ బ్యాగ్, దుస్తులు, షూ, బెల్ట్ తదితర సామగ్రిని అందిస్తున్నామని చెప్పారు. కస్తూరిబా బాలికల వసతి గృహాల్లో విద్యార్థినులకు మరింత మెరుగైన వసతులు కల్పించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. విద్యార్థినులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేస్తామని హామీ ఇచ్చారు. *అదనపు సౌకర్యాలకు హామీ* ఆత్మకూరు, బండిఆత్మకూరు కస్తూరిబా బాలికల జూనియర్ కళాశాలల్లో ఇన్వర్టర్ సౌకర్యం, తాగునీటి వసతి, మెరుగైన రోడ్డు సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి హామీ ఇచ్చారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. విద్యార్థినుల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. *ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు* ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి భారత మాజీ రాష్ట్రపతి, ప్రముఖ తత్వవేత్త, విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి, ఒకరికి ఒకరు తినిపించుకొని సంతోషంగా ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విద్యారంగానికి ఉపాధ్యాయులు చేస్తున్న సేవలను ఎమ్మెల్యే కొనియాడారు. విద్యార్థుల జీవితాలకు దిశానిర్దేశం చేస్తూ, సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్న ఉపాధ్యాయుల సేవలు చిరస్మరణీయమని అన్నారు. అనంతరం యం.ఈ.ఓ-1 మేరీ మార్గరెట్, యం.ఈ.ఓ-2 ఆయుబ్ మహమ్మద్ లను ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు మున్సిపల్ చైర్మన్ ఎస్.బేబీ, ఆత్మకూరు మండల తహసిల్దార్ జి.రత్న రాధిక, ఎన్డీయే కూటమి నాయకులు, విద్యాశాఖ అధికారులు, కళాశాల సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News