ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యలను ప్రభుత్వం ఇకనైనా జాప్యం చేయకుండా వీలైనంత త్వరగా పరిష్కరించాలని, లేనిపక్షంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమ కార్యాచరణ చేపడతామని పిఆర్టియు నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ చాంద్ బాష ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 11వ పిఆర్సి గడువు ముగిసి ఇప్పటికే మూడు సంవత్సరాలు పూర్తయినా, 12వ పిఆర్సి కమిషన్‌ను ఏర్పాటు చేయకపోవడం ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోందని అన్నారు. గతంలో నియమించిన పి ఆర్ సి కమిషన్ చైర్మన్ కేవలం ఏడు నెలలకే ఎటువంటి నివేదిక సమర్పించకుండా రాజీనామా చేసి, దాదాపు రెండేళ్లు గడిచినా ఇప్పటివరకు కొత్త పిఆర్సి కమిషన్‌ను ఏర్పాటు చేయకపోవడం, చైర్మన్‌ను నియమించకపోవడం ప్రభుత్వ నిబద్ధతపై అనేక సందేహాలకు తావిస్తోందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు సంయమనంతో వ్యవహరిస్తూ రెండేళ్లకు పైగా ఓపికతో వేచి చూశాయని తెలిపారు. అయితే, సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లేకపోవడంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు తీవ్ర నిరాశకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మకూరు మండలంలో పిఆర్టియు సభ్యత్వ నమోదు కార్యక్రమం మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సి.ప్రదీప్ కుమార్, జి.హనుమంతు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ పాఠశాలలను సందర్శించి ఉపాధ్యాయులను కలిసి పి ఆర్ టి యు సభ్యత్వ నమోదును చేపట్టారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో పిఆర్ టియు ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుందని నాయకులు తెలిపారు.
అనంతరం పి ఆర్ టి యు నాయకులు మాట్లాడుతూ ఇకనైనా ప్రభుత్వం చొరవ తీసుకుని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరిపి సమస్యలకు పరిష్కారం చూపాలని కోరారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి సమస్యలను పరిష్కరిస్తుందని ఆశిస్తున్నామని, లేనిపక్షంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లందరినీ ఐక్యం చేసి ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమ కార్యాచరణ చేపడతామని సయ్యద్.చాంద్ బాష స్పష్టం చేశారు. పి ఆర్ టి యు ప్రధాన డిమాండ్లు వెంటనే 12వ పి ఆర్ సి కమిషన్‌ను ఏర్పాటు చేయాలనీ, పిఆర్సి కమిషన్ నివేదిక సమర్పించే వరకు 30 శాతం మధ్యంతర భృతి (ఐఆర్) ప్రకటించాలని, పెండింగ్‌లో ఉన్న 5 విడతల డీఏలను వెంటనే విడుదల చేయాలనీ, ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని అవకాశాలను వినియోగించి టెట్ ను రద్దు చేయాలనీ, 2022 సంవత్సరం నుంచి పెండింగ్‌లో ఉన్న సరెండర్ లీవ్ బకాయిలను వెంటనే చెల్లించాలనీ, సిపిఎస్ ను రద్దు చేసి, 1 సెప్టెంబర్ 2004 తర్వాత ఉద్యోగాల్లో చేరిన ఉద్యోగులకు శాశ్వత పెన్షన్ పరిష్కారం కల్పించాలనీ, పెండింగ్‌లో ఉన్న డిఎ అరియర్స్, 11వ పిఆర్సి బకాయిలను వెంటనే చెల్లించాలనీ, సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి 2018 జూలై, 2019 జనవరి డీఏ బకాయిలను అన్ని విడతల్లో పూర్తిగా చెల్లించాలనీ, ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు చెల్లించాల్సిన అన్ని ఆర్థిక బకాయిలను కాలపరిమితితో కూడిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించి దశలవారీగా చెల్లించాలనీ అన్నారు. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యలపై ప్రభుత్వం ఇకపై జాప్యం చేయకుండా తక్షణమే స్పందించి, స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను ప్రకటించి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని పి ఆర్ టి యు నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పి ఆర్ టి యు రాష్ట్ర నాయకులు పి.నూర్ మొహమ్మద్, హుస్సేన్ సాహెబ్, డి.రవి, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు ఎం.చంద్రశేఖర్, జిల్లా కౌన్సిల్ సభ్యులు మహేశ్వర రావు, ఖాజా, మన్సూర్, తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News