ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల : ప్రపంచ ఆదివాసి దినోత్సవ సందర్భంగా నంద్యాల పట్టణంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని, జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి గణియా, సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ అధికారులకు గిరిజన ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు జవహర్ నాయక్ సమస్యలను విన్నవిస్తూ పాలకులు మారుతున్నారు తప్ప, పద్ధతులు మారుతున్నాయని ప్రకటనలు గుప్పిస్తున్నారు.. కానీ నల్లమల అటవీ ప్రాంతంలో నివసించే చెంచు గిరిజనుల బతుకుల్లో మాత్రం ఎలాంటి వెలుగులు నిండడం లేదన్నారు. ప్రభుత్వాలు ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయికి చేరుతున్నాయని అధికారులు చెబుతున్న మాటలన్నీ అటవీ సరిహద్దుల దాకా కూడా వెళ్లడం లేదనడానికి నల్లమల గూడెంలలో నెలకొన్న పరిస్థితులే సజీవ సాక్ష్యం అని అన్నారు. కేవలం ఒక్క అర్తి నాగమ్మ మాత్రమే కాదు, నల్లమల అటవీ ప్రాంత పరిధిలోని అనేక గూడెంలో ఉన్న ఎంతో వికలాంగులు, భర్తను కోల్పోయిన వితంతువులు గత కొన్నేళ్లుగా పింఛన్లు రాక తీవ్ర అవస్థలు పడుతున్నారు. శారీరక వైకల్యం ఉన్నవారు, ఆసరా లేక నిస్సహాయ స్థితిలో ఉన్న వితంతువులు ఆకలితో అలమటిస్తూ దీనస్థితిలో కాలాన్ని వెళ్లదీస్తున్నారు. *కాళ్లరిగేలా తిరిగినా కరుణించని అధికారులు* పింఛన్ల కోసం ఆయా గ్రామాల్లోని, చెంచు గిరిజనులు కాళ్లరిగేలా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. గూడెంల నుంచి మైళ్ల కొద్దీ దూరం నడిచి వచ్చి, అధికారుల కాళ్లవేళ్లా పడి మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోతోందనీ అన్నారు. "అప్లికేషన్ పెట్టాం.. పరిశీలిస్తున్నాం.. పైఅధికారులకు పంపాం" అనే మూస సమాధానాలు తప్ప, ఏ ఒక్క నిరుపేదకీ శాశ్వత పరిష్కారం చూపడం లేదు. కార్యాలయాల చుట్టూ తిరిగి దరఖాస్తులు సమర్పించడానికే వారి దగ్గరున్న అరాకొరా డబ్బులు ఖర్చయిపోతున్నాయని బాధితులు కన్నీరు మున్నీరవుతున్నారనీ అన్నారు. *ప్రభుత్వం, స్థానిక యంత్రాంగ వైఫల్యం* గిరిజనాభివృద్ధి కోసం ఐటీడీఏ డిపార్ట్మెంట్ వంటి ప్రత్యేక సంస్థలు, ప్రత్యేక నిధులు ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయి అధికారుల అలసత్వం వల్ల అసలైన లబ్ధిదారులకు న్యాయం జరగడం లేదన్నారు. స్థానిక పంచాయతీ, మండల స్థాయి అధికారులు, జిల్లా స్థాయి అధికారులు అటవీ ప్రాంత గూడెంలను సందర్శించి సర్వేలు నిర్వహించడంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. కాగితాల మీద లెక్కలు చూపించడానికే పరిమితమైన స్థానిక యంత్రాంగం కనీస మానవత్వంతో వ్యవహరించకపోవడం శోచనీయం అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎన్ని కొత్త పథకాలు ప్రవేశపెట్టినా, సమాజంలో అత్యంత వెనుకబడిన ఈ గిరిజనులకు అవి అందనప్పుడు ఆ పథకాలకు అర్థం ఏముంది? ప్రజా ప్రతినిధులు ఓట్ల కోసం గూడెంలకు రావడం తప్ప, గెలిచాక వీరి అవస్థలను పట్టించుకోవడం లేదని స్థానిక గిరిజన సంఘాలు మండిపడుతున్నాయి అని అన్నారు. *ప్రభుత్వం తక్షణమే స్పందించాలి* ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం, గిరిజన సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలన్నారు. నల్లమల అటవీ ప్రాంతంలోని, ప్రతీ గూడెంలో ప్రత్యేక పింఛన్ క్యాంపులు నిర్వహించి, అర్హులైన ప్రతీ వికలాంగుడికి, వితంతువుకి తక్షణమే పింఛన్లు మంజూరు చేయాలన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న స్థానిక అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అడవి బిడ్డల ఆకలి కేకలను అణచివేయకుండా ఆసరాగా నిలవాలని గిరిజన ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు జవహర్ నాయక్, గిరిజనులు, చెంచు గిరిజనుల హక్కుల సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారన్నారు.
Admin
E Nivas News