ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : ప్రజా సమస్యలను ప్రజల వద్దకే వెళ్లి పరిష్కరించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన "వన్ మంత్ – ఫోర్ విజిట్స్" కార్యక్రమంలో భాగంగా నందికొట్కూరు నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక పాములపాడు ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ఈ ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమంలో నందికొట్కూర్ ఎమ్మెల్యే గిత్త.జయసూర్య,జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా, జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనంజయ్ తదితర జిల్లా,మండల స్థాయి అధికారులు పాల్గొని ప్రజల నుంచి అర్జీలు,ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా మాట్లాడుతూ ముఖ్యమంత్రి దిశానిర్దేశం మేరకు ప్రతి నియోజకవర్గంలో నాలుగు నుంచి ఐదు వారాల పాటు మండల లేదా నియోజకవర్గ హెడ్‌క్వార్టర్లలో వినతులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఆళ్లగడ్డ, శ్రీశైలం నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించామని, మూడవ నియోజకవర్గంగా నందికొట్కూరులో పాములపాడు, కొత్తపల్లి మండలాలను ఒక యూనిట్‌గా తీసుకుని వినతులు స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు సమర్పించే ప్రతి అర్జీని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు 15 రోజుల సమయం కేటాయించామని,సంబంధిత అధికారులు నేరుగా అర్జీదారులతో మాట్లాడి పరిష్కార మార్గం చూపుతారని స్పష్టం చేశారు.కొత్త పింఛన్ల కోసం ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు రాగానే అర్హులైన వారికి మంజూరు చేస్తామని, ఇళ్ల స్థలాలు లేని వారు 'హౌసింగ్ ఫర్ ఆల్' పథకం కింద ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ప్రతి శుక్రవారం గ్రీవెన్స్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ప్రజలు జిల్లా కేంద్రాలకు వెళ్లే శ్రమ లేకుండా నేరుగా నియోజకవర్గంలోనే అధికారులను కలిసి సమస్యలు చెప్పుకునే గొప్ప అవకాశం ఇదని పేర్కొన్నారు. భూ రీ-సర్వే సమస్యలు,డాటెడ్ లాండ్స్,అసైన్డ్ భూముల పరిష్కారంతో పాటు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీని వేగవంతం చేస్తున్నామన్నారు. అలాగే ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టామని, రూ.250 కోట్లతో గుమ్మడాపురం తాగునీటి పథకం పునరుద్ధరణకు ప్రతిపాదనలు పంపామని తెలిపారు. ఎన్ హెచ్-340 సి జాతీయ రహదారి భూనిర్వాసితుల నష్టపరిహార సమస్యలపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టామని, ప్రజలందరూ ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పెద్దఎత్తున పాల్గొన్నారు.
Admin
E Nivas News