ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : రైతులు, కార్మికులు, నిరుపేదల గుండెల్లో గుడు కట్టుకున్న కామ్రేడ్ రామకృష్ణ 9వ వర్ధంతి సంతాప సభ ను స్థానిక మండల కేంద్రమైన పాములపాడు లోని, సిపిఎం పార్టీ కార్యాలయంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి డి.స్వామన్న అధ్యక్షతన బుధవారం ఘనంగా నిర్వహించారు. కామ్రేడ్ రామకృష్ణ చిత్రపటానికి పార్టీ సీనియర్ నాయకులు ఎం.సి.నారాయణ, సిపిఎం పార్టీ మండల నాయకులు ఎస్.బాలయ్య టి.వెంకటేశ్వరావు, ప్రజాసంఘాల నాయకులు కలిసి పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కామ్రేడ్ రామకృష్ణ పాములపాడు మండలంలోని, లింగాల గ్రామంలో జన్మించారని అన్నారు. ఆయన ఆత్మకూరు పరిసర ప్రాంతాలలో నిరుపేదలు, రైతులు, బడుగు బలహీన, తాడిత, పీడిత వర్గాల కొరకు నిరంతరం అలుపెరుగని అనేక పోరాటాలు చేశారని వారు గుర్తు చేశారు. ముఖ్యంగా లింగాల, ఇస్కాల, శివపురం గ్రామాల లిఫ్ట్ ఇరిగేషన్లను సాధించడంలో ఆయన కీలక పాత్ర పోషించారని వారు తెలిపారు. అలాగే వెలుగోడు రిజర్వాయర్ కు వన్ ఆర్ తూము నిర్మించడంలో ముందుండి నడిపించి కీలక పాత్ర పోషించారని వారు కొనియాడారు. అంతే కాకుండా ఉమ్మడి కర్నూలు జిల్లా రైతు సంఘం జిల్లా కార్యదర్శిగా, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, రైత్వారి ఎడిటర్ గా పనిచేశారని పేర్కొన్నారు. ఆయన 2016, సెప్టెంబర్ నెలలో హఠాత్తుగా మరణించడం పార్టీకి, రైతు సంఘానికి తీరని లోటని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు ఏసేపు, రైతు సంఘం నాయకులు రాజు, టి.అశ్విని, టి.లోహిత్, ధనుష్, మాల మహానాడు నాయకులు అంకన్న, డక్క.శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News