ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / ఎన్టీఆర్ జిల్లా : కన్నడ సాంస్కృతిక శాఖ డైరెక్టర్ కేఎం.గాయత్రి సారథ్యంలోని ఎనిమిది మంది సభ్యులతో కూడిన కర్ణాటక ఉన్నతస్థాయి అధ్యయన బృందం జిల్లాలో పర్యటించింది. మంగళవారం ఆంధ్రప్రదేశ్ భాషా, సాంస్కృతిక శాఖతో పాటు మైనారిటీ శాఖ ఉన్నతాధికారులతో భేటీ అయిన అనంతరం జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ను, కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో బృంద సభ్యులు కలిశారు. కర్ణాటకలో ద్రావిడ భాష తుళును రెండో అధికారిక భాషగా గుర్తించాలనే సంకల్పం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో ద్వితీయ భాషాగా ఉర్దూ అమలు తీరును అధ్యయనం చేసేందుకు ఈ బృందం పర్యటించింది. విద్యా రంగంతో పాటు పంచాయతీలు, పోలీస్ స్టేషన్లు ఇలా వివిధ ప్రాంతాల్లో రెండో అధికార భాషా అమలు తీరుపై బృందం సమాచారాన్ని సేకరించింది. రాష్ట్ర భాష, సాంస్కృతిక శాఖ అధికారులతో పాటు మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులు బృందానికి అవసరమైన సమాచారాన్ని అందించారు.
జిల్లా కలెక్టర్ లక్ష్మీశ... బృందంతో ముచ్చటించి, సందేహాలు నివృత్తి చేశారు. ఈ బృందంలో ఉస్మానియా విశ్వవిద్యాలయ కన్నడ చైర్ ప్రొఫెసర్ తో పాటు తుళు కమిషన్ చైర్మన్ తదితరులు ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ ఆర్.మల్లికార్జునరావు తెలిపారు.
Admin
E Nivas News